ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ పంపిణీకి సంబంధించి పౌరసరఫరాల శాఖ మంత్రి మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో.. రేషన్ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాల నిర్వాహకులేనని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రేషన్ డోర్ డెలివరీ పేరుతో 9,260 వాహనాలు కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.. దీంతో పౌరసరఫరాల సంస్థకు రూ. 1,500 కోట్ల నష్టం కలిగిందన్నారు. రాష్ట్రంలో ఎండీయూల ద్వారా రేషన్ పంపిణీ చేయడంపై త్వరలోనే చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.రేషన్లో భాగంగా పేదలకు ఇచ్చే పంచదార, అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనె ప్యాకెట్లు బరువు తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ఈ కారణంగానే రాష్ట్రవ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె ఇతర ప్యాకెట్ల పంపిణీ నిలిపేయాలని మంత్రి అధికారుల్ని ఆదేశించారు. అలాగే ప్రస్తుతం నిలిపివేసిన పంచదార, కందిపప్పు, ఇతర వస్తువుల్ని త్వరలోనే రేషన్ కార్డుదారులకు అందజేస్తామన్నారు మంత్రి. రేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని.. అవినీవితికి తావు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబం రేషన్ బియ్యం మాఫియాలో కీలకంగా ఉందని.. భారీగా అవినీతి జరిగిందన్నారు మనోహర్. గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటూ కాకినాడ పోర్టును అక్రమ బియ్యం ఎగుమతులకు అడ్డాగా మార్చారని ధ్వజమెత్తారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రేషన్ మాఫియాను వదిలేది లేదన్నారు. ఇటీవల కాకినాడ పోర్టుకు సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా రూ. 159 కోట్ల విలువైన 35,404 టన్నుల బియ్యాన్ని సీజ్ చేసినట్లు మంత్రి తెలిపారు. పేదల పొట్టగొట్టి దోపిడీకి పాల్పడినవారిలో ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదన్నారు. పౌరసరఫరాల శాఖలో అన్ని అంశాలపై సమీక్ష చేస్తున్నామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.
రైతులకు రబీలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి చెల్లించాల్సిన బకాయిల్లో రూ. 1,000 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల మంది రైతులకు ఈ బకాయిల్ని చెల్లిస్తున్నామన్నారు.. మిగిలిన రూ.659 కోట్లును కూడా త్వరలోనే విడుదల చేస్తామన్నారు. గత ప్రభుత్వం రైతులకు రూ. 1,659 కోట్ల ధాన్యం బకాయిలు పెట్టిందని.. వారిని మోసం చేసిందన్నారు. అలాగే గత పాలనలో పౌరసరఫరాల సంస్థ అప్పులు రూ. 36,300 కోట్లకు చేరాయన్నారు. వీటిలో రూ.10వేల కోట్లను వచ్చే ఏడాది మార్చిలోగా తీర్చాలని నిర్ణయించామన్నారు. రైతులకు టార్పాలిన్లు పంపిణీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతుల బకాయిల గురించి చెప్పగానే.. పెద్ద మనసుతో స్పందించి రూ.వెయ్యి కోట్లు విడుదల చేశారన్నారు. మరి ప్రభుత్వం ఎండీయూ వాహనాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.