కేంద్ర మంత్రివర్గంలో పదవులపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం రెండురోజుల పాటు హస్తినలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఏపీకి సహకారం అందించాలని కోరారు. తన పర్యటన పూర్తైన సందర్భంగా మీడియాతో మాట్లాడారు చంద్రబాబు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలో టీడీపీకి దక్కిన మంత్రి పదవులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి తాము ఎలాంటి పదవులూ ఆశించలేదని చంద్రబాబు చెప్పారు. గతంలో వాజ్‌పేయీ ప్రధానిగా పనిచేసిన సమయంలోనూ టీడీపీ మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు.. అప్పుడు కూడా ఎలాంటి పదవులు ఆశించలేదని అన్నారు.
మరోవైపు అప్పట్లో ఏడు మంత్రి పదవులు తీసుకొమ్మని వాజ్‌పేయీ కోరారన్న చంద్రబాబు.. తాము అంగీకరించలేదన్నారు. ఎన్డీఏలో ఉన్నందున కూటమిలోని పార్టీలతో సంబంధాల కోసమే స్పీకర్ పదవి తీసుకున్నామని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు కూడా మోదీ మంత్రివర్గంలో టీడీపీకి కేటాయించిన రెండు మంత్రిపదవులతో సంతోషంగా ఉన్నట్లు చంద్రబాబు చెప్పారు. మోదీ మంత్రివర్గంలో పౌరవిమానయానశాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు, గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ కొనసాగుతున్నారు.
మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. సొంతంగా అధికారంలోకి రాకపోవటంతో టీడీపీ, జేడీయూ పార్టీల మద్దతుతో కేంద్రంలో మోదీ సర్కారు కొలువుదీరింది. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా మారటంతో.. ఆ పార్టీకి పెద్దసంఖ్యలో మంత్రిపదవులు వస్తాయని ప్రచారం జరిగింది. కీలకమైన మంత్రిత్వశాఖలను కూడా టీడీపీ కోరే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. అలాగే లోక్ సభ స్పీకర్ పదవి సైతం టీడీపీ సొంతం అవుతుందని విశ్లేషణలు వచ్చాయి. అయితే మోదీ వర్గంలో టీడీపీకి రెండు మంత్రిపదవులు మాత్రమే కేటాయించారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ హోదా కలిగిన పౌరవిమానయానశాఖ మంత్రి పదవి వరించింది.
అలాగే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి పదవి దక్కింది. ఇక లోక్ సభ స్పీకర్ పదవి ఓం బిర్లానే మరోసారి వరించింది. ఈ నేపథ్యంలో కేంద్రంలో తమకు దక్కిన మంత్రి పదవులపై సంతోషంగానే ఉన్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. గతంలోనూ తాము మంత్రి పదవులను డిమాండ్ చేయలేదని గుర్తు చేశారు.