రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశానికి వేళైంది. ఇద్దరు ముఖ్యమంత్రుల భేటికి ముహూర్తం ఖరారైంది. శనివారం సాయంత్రం ఆరు గంటలకు హైదరబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో తెలుగురాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంంగా విభజన తర్వాత అపరిష్కృతంగా ఉన్న అనేక అంశాలపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. వీరిద్దరూ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించాక సమావేశం కావటం ఇదే తొలిసారి. మరోవైపు సీఎంల భేటీకి ప్రజాభవన్‌లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ అజెండా
మరోవైపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలపైనా చర్చ జరగనుంది. విద్యుత్ బకాయిలకు సంబంధించి ఏపీ నుంచి తమకు 24 వేలకోట్లు రావాలని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వమే తమకు 7 వేలకోట్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం వాదన. ఈ నేపథ్యంలో ఈ అంశంపైనా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు షెడ్యూల్ 9లో ఉన్న 91 సంస్థల అప్పులు, ఆస్తులకు సంబంధించి 68 సంస్థల విషయంలో రాష్ట్రాల మధ్య అభ్యంతరాలు లేవు. మిగిలిన 23 సంస్థలపైనే చిక్కుముడి నెలకొంది. ఈ 23 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వలపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీనిపైనా చర్చించే అవకాశం ఉంది.
ఇక పదో షెడ్యూల్‌లో 142 సంస్థలు ఉన్నాయి. వీటిలో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటి పైనా చర్చించే అవకాశం ఉంది. ఇక విభజన సమస్యలపై ఇప్పటి వరకూ రెండు రాష్ట్రాల అధికారుల మధ్య 30 సమావేశాలు జరిగాయి. అయినా పరిష్కార మార్గం దొరకలేదు. ఈ నేపథ్యంలో ఈ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు సీఎంలు రంగంలోకి దిగారు.
విభజన సమస్యల పరిష్కారానికి మూడంచెల వ్యూహం!
మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలను పరిష్కరించేందుకు మూడు అంచెల వ్యూహాలను అనుసరించాలని ప్రభుత్వాలు యోచిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా తొలుత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఉంటుంది. ఆ తర్వాత రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు భేటీయై సీఎంల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చిస్తారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాలకు చెందిన వివిధ శాఖల అధికారులు భేటీయై సమస్యలకు పరిష్కార మార్గాలపై చర్చించనున్నట్లు సమాచారం.