ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం వద్ద అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదారమ్మ పరవళ్లు తొక్కింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పోలవరం స్పిల్ వే వద్ద నీటి ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు ఎగువన ఉన్న రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి ఉప నదులైన శబరి, ఇంద్రావతి, సీలేరు, మానేరు, కిన్నెరసాని,ప్రాణహిత, పర్ణ, పూర్ణ, మంజీర, ప్రవర నదుల నీటిమట్టం పెరిగింది. ఈ ఉప నదులన్నీ గోదావరిలో కలుస్తుండగా.. గోదావరి నదిలో నీటిమట్టం పెరిగింది. దీంతో పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్దకు గోదారి పరుగులు పెడుతోంది. స్పిల్ వే వద్ద నీటిమట్టం 26 మీటర్లకు చేరడంతో.. గేట్లను తెరిచి పోలవరం స్పిల్ వే నుంచి నీరు విడుదల చేశారు. మొత్తం 48 క్రస్ట్ గేట్లను తెరిచి వరదనీటిని విడుదల చేస్తుండటంతో గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి వరద ప్రవాహం పెరుగుతోంది. ఫలితంగా స్పిల్ వే ఎగువన 26.290 మీటర్లు. దిగువున 16.350 మీటర్ల నీటిమట్టం నమోదైంది. దీంతో అదనంగా వస్తున్న 43,878 క్యూసెక్కుల వరద నీటిని క్రస్ట్ గేట్లు తెరిచి విడుదల చేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ మేఘా ఎక్స్ వేదికగా పంచుకుంది.
మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోసారి పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యత పెరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో ఇటీవలే విదేశీ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టను సందర్శించింది. ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త దానిని నిర్మించాలని కేంద్ర జలసంఘం నిర్ణయించింది. అయితే ఎక్కడ నిర్మించాలనే దానిపై విదేశీ నిపుణుల సూచనలు కోరింది. మరోవైపు నాలుగురోజుల పాటు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన విదేశీ నిపుణుల బృందం.. మధ్యంతర నివేదిక ఇచ్చేందుకు సమయం కోరింది. నివేదికల అధ్యయనానికి సమయం దొరకలేదన్న విదేశీ నిపుణులు..వాటన్నింటినీ అధ్యయనం చేసి రెండు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇస్తామని తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై జలసంఘం ప్రణాళిక రచించనుంది.