ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రుల్ని కలిశారు.. రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రధాని మోదీతో భేటీలో ముఖ్యంగా ఏడు అంశాలపై చంద్రబాబు చర్చించారు. రాష్ట్రానికి స్వల్పకాలానికి ఆర్థికంగా చేయూతనివ్వమని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పునఃప్రారంభానికి వెంటనే చర్యలు తీసుకోవాలని విన్నవించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ముఖ్యమైన మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల సముదాయం పూర్తికి సమగ్ర ఆర్థిక సాయం అందించాలని కోరారు. పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహకాలు.. రాష్ట్రాలకు మూలధన వ్యయం అందించే ప్రత్యేక పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు అదనపు కేటాయింపులు జరిపి రోడ్లు, బ్రిడ్జిలు, సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలన్నారు చంద్రబాబు. బుందేల్‌ఖండ్ ప్యాకేజీ తరహాలో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు సాయం చేయాలని కోరారు. అలాగే దుగరాజపట్నం పోర్టు పూర్తి చేసేలా రాష్ట్రానికి చేయూతను అందించాలన్నారు. చంద్రబాబు ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదని.. వచ్చే ఆదాయం జీతాలు, పింఛన్లు, అప్పులు తీర్చడానికి కూడా సరిపోవడం లేదని.. కేంద్రం చేయూత ఇవ్వాలని కోరారు. మిగిలిన రాష్ట్ర సమస్యల్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు, జలవనరులు, రోడ్లు, రాజధాని నిర్మాణాలను గత ప్రభుత్వం విస్మరించడంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు చంద్రబాబు. కేంద్రం ఆర్థికంగా చేయూతనివ్వకపోతే ఈ సవాళ్ల నుంచి బయటపడటం కష్టమన్నారు ముఖ్యమంత్రి. ప్రధాని మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ బలమైన పవర్‌హౌస్‌గా అవతరిస్తుందని తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యానంటూ కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. దేశం, రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేయడానికి సంబంధించిన అనేక విషయాలపై తాము చర్చించామమన్నారు. విక్షిత్ భారత్, విక్షిత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఎన్‌డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 'ధన్యవాదాలు అమిత్ షా గారు.. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పని చేసేందుకు మేము సర్వ సన్నద్ధంగా ఉన్నాము. ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు సదా మీ సహకారం అవసరం' అంటూ చంద్రబాబు స్పందించారు.
ఏపీలో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు భూసేకరణ ఖర్చు రూ.385 కోట్లు విడుదల చేయాలని కేంద్రమంత్రి అమిత్ షాను చంద్రబాబు కోరారు. ఈ శిక్షణ కేంద్రం నిర్వహణకు రూ.27.54 కోట్లు ఇవ్వాలని విన్నవించారు. విభజన చట్టం ప్రకారం ఆస్తులను పంపిణీ చేయడంతో పాటుగా.. పదో షెడ్యూల్‌లోని రాష్ట్ర స్థాయి సంస్థలను విభజించాలని కోరారు. ఏపీ జెన్‌కో, తెలంగాణ డిస్కంల మధ్య ఉన్న ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని అమిత్ షాకు విన్నవించారు. అంతేకాదు ఏపీ ఐపీఎస్ కేడర్‌ను సమీక్షించాలని.. ఐపీఎస్‌ల సంఖ్యను 79 నుంచి 117కి పెంచాలని కోరారు.
అమరావతి అభివృద్ధికి దోహదం చేసే ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును వెంటనే మంజూరు చేయాలని చంద్రబాబు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని 6/8 వరుసలుగా విస్తరించాలని విన్నవించారు. హైదరాబాద్- అమరావతి మధ్య కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే అభివృద్ది.. విజయవాడలో తూర్పు బైపాస్ రోడ్డును మంజూరు చేయాలని కోరారు. మరికొన్ని రోడ్లకు సంబంధించిన అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు. అలాగే మరికొందరు కేంద్రమంత్రుల్ని కలిసి కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో 66 మంది అధికారులకు విందు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తమ వంతుగా చేయూతను అందించాలని కోరారు.