కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రభుత్వం కలిసి రోడ్లకు మరమ్మత్తు పనులు చేపట్టారు.. అవసరమైన చోట్ల కొత్త రోడ్లను వేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొందరు టీడీపీ నేతలు, తెలుగు తమ్ముళ్లు తమ నియోజకవర్గంలో రోడ్ల పనులకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోని ఓ ప్రాంతంలో రోడ్డుకు మధ్యలో గుంత ఏర్పడితే కొబ్బరి బోండాలతో పూడ్చారంటూ ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కొందరు ట్వీట్ చేశారు. 'వర్త్ తమ్ములు వర్త్.. ఆ బొండాల మీద ఇంత బూడిద వేస్తే సెట్టు.. ఇంక ఏ వరదలోచ్చినా గుంతలు పడవు'అంటూ కొందరు ట్వీట్‌లు చేశారు. ఏపీలో రోడ్డుపై గుంతను పూడ్చడానికి ఇలా చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది.
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్.. '2020 సంవత్సరంలో బ్రెజిల్ లోని ఫోటోను, నేడు ఏపీలో జరిగినట్లుగా అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి ఫేక్ ప్రచారాలను నమ్మకండి' అంటూ ట్వీట్ చేసింది. బ్రెజిల్‌కు సంబంధించిన ఒరిజనల్ ఫోటోను కూడా ట్వీట్ చేశారు. బ్రెజిల్ ఫోటోను ఏపీలోదిగా ఫేక్ ప్రచారం చేస్తున్నారని.. ఎవరూ నమ్మొద్దని సూచించారు. అయితే ఇదంతా వైఎస్సార్‌సీపీ పని అని కొందరు ఆరోపిస్తున్నారు.. ఇలా తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఎప్పటికప్పుడు ఫేక్ ప్రచారాలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ ఉంటుంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాఖలవారీగా సమీక్షలు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లపై కూడా అధికారులతో రివ్యూ చేశారు. వర్షాకాలంలో రోడ్లు మరింత దెబ్బతినే అవకాశం ఉందని.. అందుకే ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని సూచించారు. ముందు రోడ్లపై గుంతలు పూడ్చడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు వెంటనే రోడ్లపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు.