ఆంధ్రప్రదేశ్‌లో కొలువు దీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం మరో పథకం అమలుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సామాజిక భద్రత పింఛన్ల పెంపు, మెగా డీఎస్సీ, ఉచిత ఇసుక వంటి హామీలను అమలుచేసిన ఏపీ ప్రభుత్వం.. ఈసారి రైతులకు మేలు కలిగించేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ కూటమి అనేక హామీలు ఇచ్చింది. అందులో ప్రధానంగా సూపర్ సిక్స్ పేరిట టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో జనంలోకి బలంగా దూసుకెళ్లి ఓట్ల వర్షం కురిపించింది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పేరిట రైతులకు ఏటా రూ.20 వేలు చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని అప్పట్లో ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో హామీల అమలుపై కసరత్తు ప్రారంభించిన టీడీపీ.. అన్నదాత సుఖీభవ పథకం అమలుపైనా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతుభరోసా పేరిట రైతులకు పెట్టుబడి సాయం అందించేవారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట కేంద్రం ఏటా అందించే రూ.6 వేలకు తోడు మరో రూ.7,500 కలిపి.. ఏటా రూ.13,500 సాయంగా అందిస్తూ వచ్చారు. అయితే ఎన్నికల ప్రచారం సమయంలో ఈ మొత్తాన్ని రూ.20 వేలకు పెంచుతామని టీడీపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో త్వరలోనే ఈ హామీ అమలుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గతంలోలాగే మూడు విడతల్లో రూ. 20 వేలు సాయం అందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పేరిట పోర్టల్ కూడా ప్రారంభించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు తోడు మరో 14 వేలు కలిపి రూ.20 వేలు అందించనున్నట్లు తెలిసింది.
ఈ పథకం అమలుపై విధివిధానాలు కూడా ప్రభుత్వం త్వరలోనే ఖరారు చేయనుంది. కుటుంబంలో ఒకరికే ఈ పథకం కింద లబ్ధి పొందేలా నిబంధనలు ఉండనున్నట్లు తెలిసింది. జులై నెలలోనే కేంద్రం, రాష్ట్రాలు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో ఈ పథకానికి కేటాయింపులు జరిపి.. ఆ తర్వాత అమలు చేసే అవకాశాలు ఉన్నాయి.