ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. రెండో రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం జరుగుతుంది. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేని కారణంగా మరో మూడు నెలలపాటు తాత్కాలిక బడ్జెట్ కోసం ఈ సమావేశాల్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశంపై ప్రతిపాదనలు చేసే ఛాన్స్ ఉంది. మరో 4 నెలల పాటు ఓటాన్ అకౌంట్ కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్టు సమాచారం. కొంచెం ఆర్థిక వెసులుబాటు, వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై స్పష్టత రావడానికి మరి కొంత సమయం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. వాటిపై స్పష్టత వచ్చాక సెప్టెంబరులో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక శాఖ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. కాగా ఆర్డినెన్స్ పెట్టాలనే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఎదురు చూస్తోంది.