బేకరీల్లో దొరికే బర్గర్ అంటే చాలా మందికి ఇష్టం. జంక్ ఫుడ్ తినేవారిలో చాలా మంది ఈ బర్గర్‌నే ఎంచుకుంటారు. అదీ బర్గర్ రేంజ్ మరి. అయితే ఇలాంటి బర్గర్ తినడం కాదు దాని రేటు వింటేనే షాక్ కొట్టినంత పని అవుతోంది. ఎందుకంటే ఆ ఒక్క బర్గర్ కొనాలంటే రూ.4.5 లక్షలు చెల్లించాల్సిందే. ఇక ఈ విషయం కాస్తా ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లక్షలు పోసి ఆ బర్గర్ కొనడం ఏంటి అని ప్రస్తుతం అందర్లో ఒకే ప్రశ్న వెల్లువెత్తుతోంది. అంతలా అందులో ఏం ఉంది. దేనితో తయారు చేస్తారు అనే చర్చ జరుగుతోంది.
అయితే ఈ బర్గర్‌ను నెదర్లాండ్‌లో తయారు చేశారు. రాబర్ట్ జాన్ డి వీన్ అనే చెఫ్ తయారు చేసిన ఈ బర్గర్.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత కాస్ట్‌లీ బర్గర్‌గా నిలిచింది. దీంతో ఈ బర్గర్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డి రికార్డ్స్‌లో చోటు కూడా దక్కించుకుంది. ఈ బర్గర్‌కు "ది గోల్డెన్ బాయ్" అని పేరు కూడా పెట్టారు. దీన్ని 5 వేల యూరోలు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.4.5 లక్షలకు విక్రయించారు. ఈ గోల్డెన్ బాయ్ బర్గర్ తీపి, పులుపు, ఉప్పు, చేదు వంటి వివిధ రకాల రుచులను కలిగి ఉంటుంది.
ఈ బర్గర్ తయారీకి ఖరీదైన పదార్ధాలను వినియోగించడం వల్ల అద్భుతమైన రుచి వచ్చినట్లు చెఫ్ రాబర్ట్ జాన్ వెల్లడించాడు. ఈ ది గోల్డెన్ బాయ్ బర్గర్ తయారీలో బెలుగా కావియర్, కింగ్ క్రాబ్, స్పానిష్ పాలేటా ఇబెరికో, వైట్ ట్రూఫుల్, ఇంగ్లీష్ చెద్దర్ చీజ్ వంటి పదార్థాలను ఉపయోగించారు. ఇక ఇందులో బార్బీక్యూ సాస్‌ను కూడా వినియోగించారు. అత్యంత ఖరీదైన బీఫ్.. డోమ్ పెరిగ్నాన్-ఇన్ఫ్యూజ్డ్ షాంపైన్ నుంచి సేకరించిన ఉల్లిపాయ రింగులను ఆ బర్గర్ తయారీలో వాడారు. ఇక చివరిగా ఆ బర్గర్‌లోని బ్రెడ్ ముక్కపై పూసిన పీస్ డి రెసిస్టెన్స్ అనే బంగారు పూతను కూడా పూశారు.
అయితే ఇలాంటి ఖరీదైన బర్గర్‌ను తయారు చేయాలని కరోనా సమయంలో తనకు ఆలోచన వచ్చినట్లు చెఫ్ రాబర్ట్ వెల్లడించాడు. ఈ బర్గర్లను విక్రయించడం వల్ల వచ్చిన డబ్బుతో వెయ్యి ఆహార ప్యాకెట్లను కరోనా సమయంలో పేదలకు అందించినట్లు చెప్పాడు. అయితే ఈ కాస్ట్‌లీ బర్గర్‌పై చాలా మంది ప్రశంసల జల్లు కురిపిస్తుంటే సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. ప్రపంచ దేశాలు ప్రస్తుతం సామాజిక, ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే.. ఇలా లక్షలకు లక్షల విలువైన బర్గర్లు తయారు చేయడం ఏంటి అని పేర్కొంటున్నారు.