ముంబయి బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో అధికారులు చర్యలు వేగవంతం చేశారు. నిందితుడు మిహిర్ షా (24) మద్యం సేవించిన పబ్‌ను బుధవారం ఉదయం బుల్డోజర్లతో కూల్చివేశారు. జుహులోని వైస్-టపాస్ పబ్ నిబంధనలను ఉల్లంఘించిందని, చట్టపరంగా 25 ఏళ్లలోపు వ్యక్తికి మద్యం సరఫరా చేయరాదని అధికారులు పేర్కొన్నారు. ఈ బార్‌ను సోఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేసిన 24 గంటల తర్వాత కూల్చివేతలు చేపట్టడం గమనార్హం. శివసేన నేత రాజేశ్ షా కుమారుడు మిహిర్ షా.. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున వరకూ ఈ బార్‌లోనే ఉండి, మద్యం సేవించినట్టు తేలింది. మొత్తం బిల్లు రూ.18 వేలు చెల్లించినట్టు పోలీసులు విచారణలో వెల్లడయ్యింది.
తక్కువ వయస్సు గల వ్యక్తులకు మద్యం సరఫరా చేయడమే కాకుండా సరైన లైసెన్స్ లేకుండా బార్ నడుపుతున్నారని అధికారులు తెలిపారు. అంతేకాదు ప్రభుత్వం స్థలాన్ని ఆక్రమించి భవనం నిర్మించినందుకు బార్‌కు కూడా సీలు వేశామని, అక్రమ కట్టడాన్ని కూల్చివేశామని పేర్కొన్నారు. బాంబే ఫారిన్ లిక్కర్ రూల్స్‌లోని సంబంధిత నిబంధనల ప్రకారం చర్య తీసుకున్నట్టు వెల్లడించారు. మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారు నడిపి.. మహిళ మరణానికి కారణమైన మిహిర్ షాను పోలీసులు బుధవారం తెల్లవారుజామున అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
పబ్‌లో ఏంజాయ్ చేసిన ఆదివారం ఉదయం మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారు నడిపిన మిహిర్ షా.. స్కూటీపై వెళ్తోన్న దంపతులను ఢీకొట్టాడు. ఈ ఘటనలో వివాహిత తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయింది. బైక్‌పై వెళ్తోన్న ప్రదీక్ నక్వా ఆయన భార్య కావేరీలను వేగంగా కారు నడుపుతూ ఢీకొట్టడంతో కిందపడిపోయారు. ఆ తర్వాత ఆమెను తొక్కించి, కిలోమీటరున్నర దూరం ఈడ్చుకెళ్లాడు.
ఘటనా స్థలితో పాటు కారు ప్రయాణించిన మార్గంలో సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులకు షాకింగ్ దృశ్యాలు కంటబడ్డాయి. వివాహితను ఢీకొట్టి 1.5 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన మిహిర్ షా.. తర్వాత డ్రైవింగ్ సీటులో నుంచి మారి తన డ్రైవర్‌కు వాహనం ఇచ్చినట్్ుట గుర్తించారు. అనంతరం కిందకు దిగి.. కారు బోయిన్‌నెట్‌పై ఉన్న వివాహిత మృతదేహాన్ని పక్కకు తీసి రోడ్డుపైన పడేసి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మిహిర్ షా డ్రైవర్ రాజశ్రీ బిదావత్ కారు రివర్స్ చేసి, సీసీటీవీ వ్యూ నుంచి అదృశ్యమయ్యేలోపు మహిళపైకి మరోసారి తొక్కించినట్టు కోర్టుకు సమర్పించిన ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో మిహిర్ షఆ, అతడి తండ్రి రాజేశ్ షా తోపాటు 12 మందిని పోలీసులు ఇప్పటి వరకూ అరెస్ట్ చేశారు. వీరిలో రాజేశ్ షాకు అదే రోజున బెయిల్ వచ్చింది. రూ.15 వేల పూచీకత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.