ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముస్లిం మహిళలకు భరణం.. హైదరాబాద్ దంపతుల కేసులో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

national |  Suryaa Desk  | Published : Wed, Jul 10, 2024, 09:58 PM

విడాకుల తీసుకునే ముస్లిం మహిళలకు భరణంపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. విడాకులు తీసుకున్న ఓ ముస్లిం మహిళకు తన భర్త నుంచి భరణం పొందే హక్కు ఉందని నుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 125 అందుకు అవకాశం కల్పిస్తుందని పేర్కొంది. విడాకుల తరవాత ముస్లిం మహిళలు భరణం తీసుకునేందుకు అర్హులేనని ఈ మేరకు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టైన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.


భార్య నుంచి విడిపోయిన తరవాత భరణం ఇవ్వాలన్న కుటుంబ న్యాయస్థానం ఆదేశాలను మహ్మద్ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. ఈ పిటిషన్‌‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం.. దిగువ కోర్టు తీర్పును సమర్దించింది. మతాలతో సంబంధం లేకుండా విడాకులు తీసుకున్న ప్రతి మహిళకు భరణం పొందే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాదు, భరణం అనేది ఏమీ విరాళం కాదని, అది పెళ్లైన ప్రతి మహిళ హక్కు అని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. సెక్షన్ 125 వివాహిత మహిళలకే కాకుండా ప్రతి ఒక్క మహిళకు వర్తిస్తుందని పేర్కొంది.


‘‘ఇంటిపట్టున ఉండే భార్య తమపైనే ఆధారపడి ఉంటుందన్న కనీస ఇంగితం కూడా కొంతమంది భర్తలకు ఉండడం లేదు. భావోద్వేగపరంగా కూడా అలాంటి మహిళలు భర్తపైనే ఆధారపడి ఉంటారు.. ఇప్పటికైనా గృహిణుల విలువ.. వాళ్లెంత త్యాగాన్ని చేస్తున్నారో పురుషులు అర్థం చేసుకోవాలి’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం చీవాట్లు పెట్టింది. తగిన ఆదాయ మార్గాలు కలిగి ఉన్న వ్యక్తి.. తన భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులకు భరణాన్ని తిరస్కరించలేరని సెక్షన్ 125 చెబుతుంది.


కేసు వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ సమద్.. తన భార్యతో విడాకులు తీసుకున్నారు. వారికి విడాకులు మంజూరు చేసిన కుటుంబ న్యాయస్థానం.. ఆమెకు భరణం చెల్లించాలని ఆదేశించింది. దీనిని తెలంగాణ హైకోర్టులో సమద్ సవాల్ చేయగా.. ఈ తీర్పులో జోక్యం చేసుకోడానికి నిరాకరించింది. దీంతో ఆయన సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లారు. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు ముస్లిం మహిళల (విడాకుల హక్కుల పరిరక్షణ) చట్టం- 1986ను ఆశ్రయించవచ్చని అతడి తరఫున న్యాయవాది వాదించారు. ఇది సెక్షన్ 125 CrPC కంటే ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుందని తెలిపారు.


దీనిపై అమికస్ క్యూరీ గౌరవ్ అగర్వాల్ స్పందిస్తూ.. CrPC కింద మహిళలకు ఉపశమనం కలిగించే అర్హతను వ్యక్తిగత చట్టం కల్పించదని కౌంటర్ ఇచ్చారు. ‘ఈ తీర్పు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి 1985లో షా బానో కేసు పూర్వాపరాల్లోకి వెళ్లాల్సిసిన అవసరం ఉంది.. CrPCలోని సెక్షన్ 125 మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని ఆ నాటి సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది.. అయితే, దీనిని ముస్లిం మహిళల (విడాకుల హక్కుల రక్షణ) చట్టం, 1986 బలహీనపరిచింది.. ఇది ముస్లిం మహిళ విడాకులు తీసుకున్న 90 రోజుల తర్వాత మాత్రమే భరణం కోరుతుందని పేర్కొంది’’ అని వాదించారు. 2001లో ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టు సమర్దించినా.. విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం అందించాల్సిన బాధ్యత భర్తకు ఉందని.. ఆమె మళ్లీ పెళ్లి చేసుకునే వరకు లేదా తనను తాను పోషించుకునే వరకు కొనసాగించాలని తీర్పు చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com