ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కులు అభివృద్ధి చేయాలని అటవీ శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఇకపై పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేట్ సంస్థలను ఆకర్షించేందుకు "టీ విత్ డిప్యూటీ సీఎం" కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. జంతు ప్రదర్శనశాలల అభివృద్ధిలో కార్పొరేట్ సంస్థలను సైతం భాగస్వామ్యం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి చర్చలు జరిపారు.