ఏపీ ప్రజలకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. మరో నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాలతో పాటు ఆవర్తనం కొనసాగుతూ ఉండటంతో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా వచ్చే రెండు రోజులు పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు, రైతులను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. మరోవైపు ఆవర్తనం ప్రభావంతో ఆది, సోమవారాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా , అనకాపల్లి, ఏలూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆదివారం అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాలో సోమ, మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, ములుగు, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, నల్గొండ, హన్మకొండ, సిద్దిపేట, జనగాం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రైతులు, అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.