అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యాయత్నం ప్రస్తుతం పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఓ వ్యక్తి చెప్పిన విషయాలు ప్రస్తుతం పెను సంచలనంగా మారాయి. కాల్పులు జరగడానికి ముందే ఆ దుండగుడిని చూసినట్లు ఆ వ్యక్తి చెప్పడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే అదే విషయాన్ని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌కు చెప్పినా వారు ముందస్తు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నాడు. దీంతో ఆ వెంటనే బుల్లెట్లు దూసుకువచ్చినట్లు వెల్లడించాడు. ఇక పక్కా ప్లాన్ ప్రకారమే ట్రంప్‌పై దాడి జరిగినట్లు సంఘటనా స్థలంలో చూస్తే తెలుస్తోంది. పవర్‌ఫుల్ గన్‌తో దుండగుడు కాల్పులు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
కాల్పులు జరిగిన సమయంలో అక్కడ ఏం జరిగిందో ఆ ప్రత్యక్ష సాక్షి వెల్లడించాడు. ఎన్నికల ర్యాలీకి సమీపంలోని ఓ భవనంపైన ఓ వ్యక్తి రైఫిల్‌తో ఉన్నట్లు తాను మొదట గుర్తించినట్లు ఆ వ్యక్తి పేర్కొన్నాడు. అది చూసి వెంటనే అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌కు చెప్పానని.. అయినా వారు డొనాల్డ్ ట్రంప్‌ను అలర్ట్ చేయలేదని చెప్పాడు. అంతలోనే కాల్పుల శబ్దం వినిపించిందని తెలిపాడు. ఈ మేరకు ఆ ప్రత్యక్ష సాక్షి మీడియాతో వెల్లడించిన ఘటనకు సంబంధించిన వీడియోను ట్విటర్, స్పేస్‌ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
మరోవైపు.. ప్రీ ప్లాన్‌తోనే దుండగుడు ట్రంప్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచార ర్యాలీకి ఎదురుగా ఉన్న ఓ బిల్డింగ్‌పై.. అత్యంత శక్తివంతమైన రైఫిల్‌తో ఆ దుండగుడు.. ట్రంప్‌పై కాల్పులకు తెగబడ్డాడని గుర్తించారు. దీంతో ముందస్తు ప్లానింగ్ ప్రకారమే ట్రంప్‌పై దాడి జరిగినట్లు అక్కడి పరిస్థితులు చెబుతున్నాయి. ఇక ఆ దుండగుడు.. బిల్డింగ్‌పైకి ఎక్కేందుకు నిచ్చెన ఉందని.. ట్రంప్ అక్కడికి రాకముందే పైకి ఎక్కి అతడు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ ఎన్నికల ర్యాలీలో ట్రంప్ ప్రసంగించిన వేదిక.. ఆ దుండగుడు తుపాకీని ఎక్కుపెట్టిన ప్రదేశం నుంచి స్పష్టంగా కనిపించింది.
ఇక ట్రంప్‌పై దాడి చేసిన నిందితుడి వయసు సుమారు 20 ఏళ్లు అని.. అతడు స్థానికం ఉండే మాథ్యూ క్రూక్స్ అని ఎఫ్‌బీఐ అధికారులు వెల్లడించారు. ఏఆర్ శ్రేణి సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో మాథ్యూ క్రూక్స్ కాల్పులు జరపగా.. అతడ్ని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కాల్చి చంపాడు. మాథ్యూ క్రూక్స్ వినియోగించిన ఆయుధాన్ని కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇక ట్రంప్‌పై కాల్పుల ఘటనను హత్యాయత్నంగానే గుర్తించి దర్యాప్తు చేపట్టినట్లు ఎఫ్‌బీఐ అధికారులు ప్రకటించారు. ట్రంప్‌పై దాడులు జరగవచ్చనే అనుమానంతోనే ఆయన సీక్రెట్ సర్వీస్ భద్రతను కొన్నాళ్ల క్రితమే మరింత కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ ఈ కాల్పులు జరగడం సంచలనంగా మారింది.