అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన కాల్పులు.. కేవలం అగ్రరాజ్యంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న సమయంలో దూరం నుంచి దుండగుడు జరిపిన కాల్పుల్లో ట్రంప్ గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనపై హత్యాయత్నం తర్వాత తొలిసారి స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. కీలక విషయాలు వెల్లడించారు. అంతేకాకుండా మళ్లీ ఎన్నికల ర్యాలీలో ట్రంప్ పాల్గొంటారని రిపబ్లికన్ పార్టీ తెలిపింది. కాల్పుల ఘటన తర్వాత ట్రంప్‌ను సెక్యూరిటీ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అనంతరం ట్రీట్మెంట్ తీసుకుని హాస్పిటల్ నుంచి ట్రంప్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్రూత్ నుంచి డొనాల్డ్ ట్రంప్ ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. తనపై జరిగిన కాల్పుల ఘటనను పూర్తిగా వివరించారు.
దుండగులు జరిపిన కాల్పుల్లో తన కుడి చెవి పైభాగంలో బుల్లెట్ తగిలిందని ట్రంప్ తెలిపారు. అయితే ఏదో ఊహించని ఘటన జరిగిందని తనకు అర్థం అయిందని.. దూరం నుంచి తనపైకి ఏదో దూసుకువచ్చినట్లు ఒక్కసారిగా శబ్దం వినిపించిందని వెల్లడించారు. ఆ తర్వాత తన చర్మంలోకి బుల్లెట్ దూసుకుపోయిందని తనకు అర్థం అయిందని వివరించారు. ఆ సమయంలో తన చెవి నుంచి చాలా రక్తం కారిందని.. ఆ తర్వాత ఏం జరిగిందో గ్రహించినట్లు చెప్పారు.
మరోవైపు.. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ 5 వ తేదీన జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఇక అధికార డెమోక్రటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీలో నిలిచారు. ఇటీవల జో బైడెన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల సొంత పార్టీ డెమోక్రటిక్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవాలని డెమోక్రాట్లు బహిరంగంగానే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు.. ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తుండటం గమనార్హం. ఈ క్రమంలోనే ట్రంప్‌పై కాల్పులు జరగడంతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.