డబ్బులు సంపాదించాలని ఎవరికి ఉండదు చెప్పండి. అసలు లోకమంతా డబ్బు చుట్టే తిరుగుతుందనడంలో సందేహమే అక్కర్లేదేమో. డబ్బు సంపాదించాలని మనిషి పడరాని పాట్లు పడుతుంటాడు. దీని కోసం ఎన్నో మార్గాలుంటాయి. కొందరు కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగంలో చేరి సంపాదిస్తుంటారు. ఇంకొందరు వ్యాపారాలు చేసుకుంటూ సంపాదిస్తుంటారు. ఇంకొందరు దొంగతనాలు చేసి.. కొందరు మనుషుల్ని మోసం చేసి.. ఇలా ఎన్నో మార్గాలు ఉంటాయి. అయితే.. డబ్బు సంపాదించాలంటే ప్రతిభతో పాటు ధైర్యం కూడా ఉండాలి. తెగువ చూపించాలి. ఇప్పటికీ ఇలా ధైర్యం, తెగువ లేక చిన్న చిన్న జీతాలు వచ్చే ఉద్యోగాలు చేసే వారు కూడా చాలా మందే ఉంటారు. అయితే అలాంటి వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తోందీ యువతి. అయితే ఇక్కడ ఆమె మంచి జీతాన్నే వదిలేసిందనుకోండి. అది వేరే విషయం.
యూట్యూబ్‌లో ఇప్పుడు కంటెంట్ క్రియేటర్లకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రియేటివ్‌గా వీడియోలు చేస్తూ.. పోస్ట్ చేస్తున్న వారికి పేరుకు పేరు, డబ్బుకు డబ్బు వస్తున్న సంగతి తెలిసిందే. యూట్యూబ్‌లో వారి వీడియోలకు వచ్చే వ్యూస్, వారి సబ్‌స్క్రైబర్ల సంఖ్యను లక్షల్లో, కోట్లల్లో సంపాదించే వారు కూడా ఉన్నారు. పెద్ద పెద్ద చదువులు చదువుకొని కూడా యూట్యూబ్‌లో వీడియోలు చేసే వారు ఉన్నారు. అదే కోవలోకి వస్తుంది నిశ్చా షా.
లండన్‌లో చాలా ఏళ్లుగా చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ ఉద్యోగం వదిలేసి యూట్యూబర్‌గా మారిపోయింది. ఇప్పుడు ఫుల్ టైమ్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అవతారం ఎత్తింది. ఇక ఆమె ఆదాయం కూడా నాలుగింతలు పెరిగింది. లండన్‌లోని క్రెడిట్ అగ్రికోల్ అనే సంస్థలో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసేది. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా ఈమెకు ఏడాదికి రూ. 2 కోట్ల వరకు జీతం ఉంది. అయితే ఆమెకు ఇదేం నచ్చలేదు.
తన కెరీర్‌ను మరింత ఉన్నతంగా మార్చుకునేందుకు.. కొత్తగా ఏదైనా చేయాలన్న సంకల్పంతో తన ఉద్యోగం వదిలేసింది. ఇతరులకు సహాయ పడాలన్న ఉద్దేశంతో.. ఫైనాన్స్ సెక్టార్‌కు చెందిన ఆమె తనకు తెలిసిన సమాచారాన్ని వీడియోల రూపంలో యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడం ప్రారంభించింది. జాబ్ చేస్తూనే యూట్యూబ్ ఛానెల్లో ఉన్నా ముందుగా ఎవరూ పట్టించుకోకున్నా తన పని తాను చేసుకుంటూ వెళ్లగా సబ్‌స్క్రైబర్లు రావడం మొదలుపెట్టారు.
దాదాపు 9 సంవత్సరాలుగా చేసిన తన ఉద్యోగాన్ని 2023 జనవరిలో వదిలేసి పూర్తిగా యూట్యూబ్‌లోకి వచ్చేసింది. ఇక 2023 మే నుంచి 2024 మే వరకు ఏకంగా రూ. 8 కోట్లు సంపాదించింది. తన కోర్సులు, ప్రొడక్ట్స్ అమ్మి ఇంత ఆర్జించింది. మొదట 1000 మంది సబ్‌స్క్రైబర్స్ సంఖ్యను చేరుకునేందుకు 11 నెలలు పట్టింది. అయితే 2022 సెప్టెంబర్‌లో తన జీవితం గురించి చెబుతూ చేసిన వీడియో ఆమె జీవితాన్నే మార్చేసింది. ఒక్క నెలలో 50 వేల మంది సబ్‌స్క్రైబర్లు రాగా.. 3 లక్షల ఆదాయం వచ్చింది. ఇక వెనుదిరిగి చూసుకున్నది లేదు. ప్రస్తుతం ఆమె యూట్యూబ్ ఛానెల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 11.7 లక్షలకుపైనే. దీంతో ఇప్పుడంతా ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు.