గుంటూరు జిల్లా, మంగళగిరిలోని బీసీవై పార్టీ కార్యాలయం సమీపంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి ఆటో ఢీ కొంది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కళ్ల ముందే కన్న బిడ్డ చనిపోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ప్రయాణికులు ఆటోలో ఇరుక్కుపోయారు. ఈ క్రమంలో అటుగా వెళుతున్న ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తన కాన్వాయ్ ఆపి సహాయక చర్యలు చేపట్టారు. సెక్యూరిటీ సాయంతో ఆటోలో ఇరుక్కున్న వారిని బయటకు తీసి వారిని అంబులెన్స్‌లో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఫోన్ చేసి చెప్పారు. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి వారిని కూడా ఆస్పత్రికి తీసుకువెళ్లారు.