ఈనెల 23నుంచి "పోలం పిలుస్తోంది" కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ, పశు సంవర్థక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇకపై సాగు విషయంలో రైతులకు శాస్త్రీయ అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా భూసార పరీక్షలు నిర్వహించి వాటి ఆధారంగా ఎరువుల వాడేలా రైతులకు అవగాహన కల్పిస్తామని అచ్చెన్న చెప్పుకొచ్చారు. రాయితీపై విత్తనాల సరఫరా, గ్రామ స్థాయిలో విత్తనోత్పత్తి, వ్యవసాయ యాంత్రీకరణ, సేంద్రీయ వ్యవసాయం వంటి శాస్త్రీయ అంశాలపై పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఎరువులు, విత్తనాలు రైతులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే దిశగా రైతులను ముందుకు నడిపించడమే "పొలం పిలుస్తోంది" కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.