తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుంది టీటీడీ. సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు వచ్చిందని చెబుతారు. బంగారువాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలో.. సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు ఆలయ పండితులు. దక్షిణాభిముఖంగా మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారిని వేంచేపు చేస్తారు. ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, ఈ ఉత్సవమూర్తులతో పాటూ ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదిస్తారు.
మంగళవాయిద్యాల నడుమ.. తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్ స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని ఊరేగింపుగా వస్తారు. ఈ ఆరు పట్టు వస్త్రాల్లో నాలుగు మూలమూర్తికి.. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తలకు శ్రీవారి పాద వస్త్రంతో పరివట్టం కట్టుకుని.. స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదిస్తారు.
అనంతరం అర్చకులు తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్ స్వామివారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యర్ స్వామివారికి.. అలాగే టీటీడీ తరఫున ఈవోకు ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలిస్తారు. హారతి, తాంబూలం, చందనం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల వద్ద ఉంచుతారు. ఇవాళ ఆణివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించారు. పుష్పపల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు.
ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం నుంచి శ్రీవారికి ఆరు పట్టువస్త్రాలతో సారెను తమిళనాడు మంత్రి, ఇతర అధికారులు సమర్పించారు. శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మఠం నుండి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల మీదుగా ఆలయంలోనికి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.