తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు వాతలు పెట్టినా ఇంకా జగన్‌కు బుద్ధి రాలేదని, పేర్ని నానికి శ్వేత పత్రం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పుడైనా వైసీపీ వాళ్లు శ్వేత పత్రాలు విడుదల చేశారా? అని నిలదీశారు. సీఎం చంద్రబాబు పోలవరం వెళ్లడం తప్పా? పోలవరం పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఆయన పర్యటన చేస్తున్నారని, వైసీపీ పరిపాలన ఎలా చేశారో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. వైసీపీ వాళ్ళ దొంగతనాలు ఎక్కడ బయటపడతాయోనని భయపడి ప్రెస్ మీట్‌లు పెడుతున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు. చంద్రబాబు సీఎం అవ్వగానే పెంచిన పింఛన్లు అందించారని.. అదే జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే ప్రజావేదిక కూల్చారని ఎద్దేవా చేశారు. అసలు చెత్త పన్ను వేసింది ఎవరు?.. జగన్ ఐదు సంవత్సరాలు పాటు రాష్ట్రాన్ని చెత్త గా మార్చేశారని.. చంద్రబాబు ఆ చెత్తంతా క్లీన్ చేస్తున్నారని, 35 రోజుల్లోనే ఆ చెత్త అంత క్లీన్ అయిపోతుందా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ఎప్పుడైనా జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేశారా? అని నిలదీశారు. దోచుకున్న లక్షల కోట్లతో సోషల్ మీడియాని నడిపిస్తున్నారని, ఆ డబ్బులతో సోషల్ మీడియాతో కూటమి నేతలపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.