రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్టును రద్దు చేయడాన్ని ఆహ్వానిస్తున్నామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. భీమవరంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్య మంత్రి చంద్రబాబు ల్యాండ్ టైటిల్ యాక్టును రద్దు చేశారని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్టును కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించాలని చూసిందని ఆరోపించారు. అదే విధంగా ప్రచారం కూడా చేశారని ప్రజలు వైసీపీ ప్రభుత్వం మోసాన్ని గుర్తించి గుణపాఠం చెప్పారన్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు మంజూరు చేసినప్పటికీ గత ప్రభుత్వం వివిధ పథకాలకు మళ్ళించారని దీనిపై నివేదికలు లేవని విచారణ చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. పలువురు అధికారులు ఆయనను సత్కరించారు.