తమ కుటుంబానికి వచ్చిన కష్టం.. పగవారికి కూడా రాకూడదని ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన ఆర్మీ జవాన్ డొక్కరి రాజేష్(25) తండ్రి చిట్డివాడు ఆవేదన వ్యక్తం చేశాడు. సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్రకు చెందిన ఆర్మీ జవాన్ రాజేష్.. జమ్మూకాశ్మీర్‌లోని ఉగ్రవాదుల ఎదురుదాడిలో సోమవారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహం కోసం కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు ఎదురుచూస్తున్నారు. రాజేష్ తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. ‘మేము నిరుపేదలం. కూలి చేస్తూ మా కుమారుడు రాజేష్‌ను ఇంటర్ వరకు చదివించాం. తొలి ప్రయత్నంలోనే ఆర్మీ ఉద్యోగం సంపాదించాడు. ఎంతో సంతోషించాం. ఇటీవల సెలవుపెట్టి ఇంటికి వచ్చాడు. పెళ్లి చేసుకో నాయనా.. అని మేము చెప్పాం. తమ్ముడికి ఉద్యోగం వచ్చి స్థిరపడిన తర్వాత.. మనం ఇల్లు కట్టుకుని.. ఆ తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని బదులిచ్చాడు. అటువంటి దయాహృదయుడు నా బిడ్డ. మాకు చేతికి అందివచ్చిన కొడుకును ఆ భగవంతుడు లాగేసుకున్నాడు. ఇటువంటి కడుపుకోత ఏ పగవాడికి కూడా రాకూడదు’ అని రాజేష్ తండ్రి చిట్డివాడు బోరున విలపించాడు. మాకు శాశ్వతంగా దూరమయ్యాడన్న బాధ ఉన్నా.. దేశం కోసం వీరమరణం పొందడం కాస్త ఆనందంగా ఉందన్నారు. రాజేష్ మృతదేహానికి గురువారం చెట్లతాండ్రలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు స్థానికులు తెలిపారు. జైపూర్ నుంచి ఆయన మృతదేహాన్ని బుధవారం రాత్రి విశాఖకు తీసుకువచ్చి.. అక్కడి కల్యాణి ఆస్పత్రిలో భద్రపరుస్తారన్నారు. గురువారం ఉదయం సైనికదళాలు రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి.. అంత్యక్రియలు పూర్తిచేస్తారని వెల్లడించారు.