బీటీ కళాశాలలో పనిచేస్తున్న 32 మంది ఉద్యోగులకు న్యాయం చేసింది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ అని ఎమ్మెల్యే షాజహానబాషా స్పష్టం చేశారు. బుధవారం మదనపల్లె స్థానిక బెంగళూరు బస్టాండు వద్ద టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్, మంత్రి నారా లోకేశ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పరమయ్యాక బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బందిని స్వాధీనం చేసుకోలేదన్నారు. దీనిపై ఇక్కడి అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది రెండేళ్లుగా వైసీపీ పాలకులను ప్రాధేయపడినా వారి నుంచి స్పందన లేదన్నారు. ఈ నెల 11న బాధితులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ దృష్టికి వారి సమస్య తీసుకెళ్లడంతో ఆయన తనకు ఫోన చేశారన్నారు. తాను వాస్తవ పరిస్థితులు వివరించడంతో 24 గంటల్లో 32 మందికి నియామకపత్రాలు, వేతన బకాయిలు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అనీబీసెంట్ స్థాపించిన బీటీ కళాశాలలో లక్షలాది మంది డిగ్రీ, పీజీ చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదిగారన్నారు. బీటీ కళాశాల అభివృద్ధికి తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు రూ.6.5 కోట్ల నిధులు తీసుకొచ్చానన్నారు. ఇలాంటి బీటీ కళాశాల ఆస్తులు కాజేసేందుకు వైసీపీ ప్రభుత్వ పాలనలో కుటిలయత్నం చేశారని ఆరోపించారు. టౌనబ్యాంకు మాజీ చైర్మన విద్యాసాగర్ మాట్లాడుతూ మదనపల్లెలో ఓ టీడీపీ నాయకుడు ఎమ్మెల్యే షాజహాన బాషా పేరు చెబుతూ కొన్ని చోట్ల అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై విచారించి పోలీసు కేసు పెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉద్యోగులు కరీం, చలపతి, నరసింహులు, అనూషా, కవిత, గౌసియా, కృష్ణవేణితో పాటు మార్కెట్ కమిటి మాజీ చైర్మన రాట కొండ గుర్రప్పనాయుడు, టీడీపీ నాయకులు నాదెళ్ల శివన్న, బాబా ఫకృద్దీన, నాగూర్‌వలి, నవీన, ఇంతాయాజ్ తదితరులు పాల్గొన్నారు.