ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్‌లను ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం హయాంలో.. మొత్తం రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్లను ప్రారంభించామని గుర్తు చేశారు. అప్పట్లో 183 అందుబాటులోకి వచ్చాయని.. మిగిలిన 20లో 18 క్యాంటీన్ల భవనాలు పూర్తయ్యాయని తెలిపారు. మరో రెండు భవనాల నిర్మాణం ప్రాథమిక దశలో ఉందని.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో క్యాంటీన్లు మూతపడ్డాయన్నారు.
టీడీపీ హయాంలో నిర్మించిన ఆ భవనాలను వార్డు సచివాలయాలు, గోదాములుగా మార్చేశారని గుర్తు చేశారు.
అన్న క్యాంటీన్లలోని ఫర్నిచర్‌ను మూలన పడేశారని.. అన్నిటికి మరమ్మతులు పూర్తిచేసి ఆగస్టు 10 నాటికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించామన్నారు నారాయణ. అంతేకాదు రాష్ట్రంలో పేదలకు రూ.5కే భోజనం అందిస్తారని.. అన్నిచోట్లా క్యాంటీన్లు ఒకేలా, ఒకే భోజన మెనూతో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్న క్యాంటీన్లకు గతంలో అక్షయపాత్ర సంస్థ నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసిందని గుర్తు చేశారు. ఈసారి కూడా అదే విధంగా.. అవే ధరలకు ఆహారాన్ని అందించేందుకు టెండర్లు పిలిచామని.. ఈనెల 22న టెండర్లు ఓపెన్ చేస్తామన్నారు మంత్రి.
మరోవైపు రాష్ట్రంలో 106 మున్సిపాలిటీల్లో డ్రైన్ల పూడికతీత పనులకు ప్రభుత్వం రూ.50 కోట్లను విడుదల చేసింది. ఈ పూడిక తీత పనుల్ని పది రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అలాగే వర్షాలు పడుతండటంతో ప్రస్తుత సీజన్‌లో వ్యాధులు ప్రబలకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించామన్నారు. అలాగే డయేరియా కేసులు నమోదవుతున్నాయని.. ఆర్వోప్లాంట్లు, బోరుబావుల్లోని కలుషిత నీటిని తాగడమే దీనికి కారణమని తనిఖీల్లో తేలిందన్నారు.
అందుకే పైపులైన్ల మరమ్మతులు, మురుగు కాల్వలో పూడికతీత పనులను వేగంగా నిర్వహిస్తున్నామని.. ప్రజలు కాచి చల్లార్చిన నీటినే తాగాలని మంత్రి సూచించారు.
2014 - 2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో 24 గంటలు మంచినీటి సరఫరా, మురుగు నీటిపారుదల వ్యవస్థకు సంబంధించి ఏఐఐబీ నుంచి రూ.5,350 కోట్లు రుణం తీసుకున్నామన్నారు మంత్రి నారాయణ. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వీటిలో కేవలం రూ.240 కోట్లను మాత్రమే ఖర్చు చేసిందన్నారు. దీంతో ఆ నిధులు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ గడువు జూన్‌తో ముగియగా.. తాము రిక్వెస్ట్ చేయడంతో మరో నెల పొడిగించారన్నారు. మరో రెండేళ్లు పొడిగించాలని ప్రభుత్వం తరఫు కోరామన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉంటే 50శాతం మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య లేకుండా పోయేదన్నారు. చెత్త పన్ను అంశంపైనా ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.