ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ సీజన్‌కు పూర్తిస్థాయిలో సంసిద్ధం కావాలని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఖరీఫ్ సీజన్ కోసం 17.50లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ప్రారంభ నిల్వలతో కలిపి 14లక్షల టన్నులు రాష్ట్రానికి చేరుకున్నట్లు ఆయన వెల్లడించారు. మిగిలిన ఎరువులు సకాలంలో రైతులకు అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,321సహకార సంఘాల్లో రైతులకు విక్రయించేందుకు ఎరువులు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. మిగిలిన లైసెన్స్ లేని సహకార సంఘాలకు తక్షణమే లైసెన్స్ మంజూరు చేసి ఎరువుల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.