చట్ట ప్రకారం శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా శాసనసభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శానసనభ పక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసన సభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత హోదానిచ్చే విషయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మౌనం పాటిస్తున్నారని వైయస్ జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే, మంత్రి పయ్యావుల కూడా ఈ విషయంలో ముందుగానే స్పందించారని.. దీనిని బట్టి ప్రతిపక్ష నేత హోదా విషయంలో వారు ముందుగానే ఓ నిర్ణయానికి వచి్చనట్లు అర్థమవుతోందన్నారు. శాసనసభలో ప్రతిపక్షం, ప్రతిపక్ష నేత ఉండటం ఎంతో అవసరమన్నారు. ప్రజలందరి సమస్యలను లేవనెత్తేందుకు, రాష్ట్రంలో న్యాయ పాలన సక్రమంగా సాగేలా చూసేందుకు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిన అవసరముందని జగన్ తన వ్యాజ్యంలో వివరించారు. విస్తృతాధికారంతో అధికారాన్ని చెలాయిస్తామంటే కుదరదని, రాజ్యాంగ సిద్ధాంతాల ప్రకారం దానిని నియంత్రించే పరిస్థితి తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.