ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో కృష్ణపట్నం పోర్టు అంశంపై చర్చ జరిగింది. కృష్ణపట్నంలో కంటైనర్ పోర్టును అదానీ తొలగించడంపై సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణపట్నంలో కంటైనర్ పోర్టు కోసం అదానీ కాళ్లు పట్టుకుంటానని ఆయన అన్నారు. కృష్ణపట్నంలోని కంటైనర్ పోర్టును అదానీ సంస్థ తీసేయడం వల్ల తీవ్ర నష్టం చేకూరుతోందని తెలిపారు. తరలిపోయిన కంటైనర్ పోర్టును కృష్ణపట్నానికి తీసుకురావాలని అదానీ కాళ్లైనా పట్టుకుంటా అని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. కంటైనర్ పోర్టు వెళ్లిపోవడం వల్ల 10 వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి కొల్పోయారన్నారు. పోర్టు కోసం భూములిచ్చామని... కంటైనర్ పోర్టు ఎత్తేయడం వల్ల తమ ప్రాంతం తీవ్రంగా నష్టపోతోందన్నారు.గతంలో అమరావతి నిర్మాణ పనుల కోసం కావాల్సిన ఎక్విప్మెంట్ కృష్ణపట్నం కంటైనర్ పోర్టు ద్వారానే దిగుమతి అయ్యేవని వెల్లడించారు. కంటైనర్ పోర్టు ఎత్తేయడం వల్ల మొత్తంగా 25 వేల ఎకరాల్లో ఉన్న వివిధ ఎస్ఈజెడ్లలోని కార్యకలాపాలు నష్టపోతున్నాయన్నారు. కంటైనర్ పోర్టు ఎత్తేసి... బూడిద తరలించే బల్క్ కార్గో పోర్టు ఉండడం వల్ల లాభమేంటి అని ప్రశ్నించారు. కృష్ణపట్నం పోర్టు కోసం సేకరించిన భూమి ఏమైపోతుందని నిలదీశారు. కృష్ణపట్నం నుంచి కంటైనర్ పోర్టు తరలించడం వల్ల ఒక్క ఆక్వా రంగానికే నెలకు రూ. 1000 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని వెల్లడించారు. కంటైనర్ పోర్టు తరలిపోతుంటే మారిటైం బోర్డు ఏం చేస్తోంది.. గోళ్లు గిల్లుకుంటోందా..? అంటూ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.