మత్స్య కార్మికులకు ప్రతిబంధకంగా ఉన్న 217 జీవోను రద్దు చేస్తామని వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాది వెంకటేశ్వరరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అచ్చెన్న మాట్లాడుతూ.. త్వరలో కేబినెట్‌లో పెట్టి ఈ జీవోను రద్దు చేస్తామన్నారు. ఈ జీవోను రద్దు చేయాలని గతంలో అనేక ఆందోళనలు జరిగాయని పేర్కొన్నారు. గతంలో ప్రతిపక్షనేత గా ఉన్న సమయంలో చంద్రబాబు ఈ జీవోను రద్దు చేస్తానని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. మత్స్యకారుల ఉనికికి, ఉపాధికి విఘాతం కలిగించే జీవోయే నెం.217. రాష్ట్ర వ్యాప్తంగా 2800 సొసైటీల పొట్టకొట్టే, లక్షలాది మంది మత్స్యకారులు రోడ్డున పడేలా అప్పట్లో జగన్ ప్రభుత్వం 217 జీవోను రూపొందించింది. అనాదిగా చెరువుల్లో చేపలు పట్టుకొని జీవనం సాగిస్తున్న మత్స్యకారులను పట్టించుకోకుండా టెండర్లు పిలిచి దళారులకు దోచిపెట్టేలా సీఎం వ్యవహార శైలి ఉందంటూ అప్పట్లో టీడీపీ నేతలు పలుమార్లు ఆందోళనలు చేశారు.