ఏపీ ల్యాండ్ టైటిలింగ్ రిపీల్ బిల్లు 2024 ను సభలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తల్లికి బిడ్డకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. అది ఆస్తి కాదని అనుబంధమని అన్నారు. ఇలాంటి భూమిని చెరపట్టేందుకు ఓ నియంత తెచ్చిన చట్టమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పేర్కొన్నారు. లక్షా డెబ్బై వేల ఎకరాలు వరకూ వైసీపీ నేతలు దోచుకున్నారన్నారు. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములను సైతం అప్పట్లో దోచుకున్నారన్నారు. దీంతో దీనిపై అప్పటి ప్రతిపక్ష నేతలు అయిన చంద్రబాబు, వవన్ కల్యాణ్‌లు దీన్ని రద్దు చేస్తామన్నారని అనగాని తెలిపారు. రెండు చట్టాలు అప్పట్లో తెచ్చారని.. ఒకటి సమగ్ర భూ సర్వే, రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అన్నారు. సమగ్ర భూ సర్వే 100 సంవత్సారాల తరువాత కనుక అది మంచిదేనని అందరం భావిస్తామని అనగాని తెలిపారు. జగన్ ప్రచార ఆర్బాటం, అధికార మదంతో దీన్ని ఇష్టానుసారం చేశారన్నారు. పాస్ పుస్తకాలు, హద్దురాళ్లపై గత సీఎం ఫోటోలు వేయించుకోవడం.. దానం ఇచ్చినట్టుగా వ్యవహరించడం దారుణమన్నారు. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్‌లో రిజిష్ట్రేషన్ చేసుకుంటే జిరాక్స్ పత్రాలు ఇస్తారని, ఆన్‌లైన్‌లో చూసుకోవాలంటున్నారని పేర్కొన్నారు. టైటిల్ రిజిష్ట్రేషన్ అధికారిని కాకుండా ఎవ్వరినైనా పెట్టుకునేట్టు ఈ సెక్షన్‌ను రూపకల్పన చేశారని అనగాని తెలిపారు. అవసరమైతే చంచల్ గూడ రూమ్మెట్‌ను కూడా ఈ స్థానంలో కుర్చోబెట్టొచ్చన్నారు. ఒకటి, రెండు అడుగులు తేడా వస్తే టైటిలింగ్ రిజిష్ట్రార్ దగ్గరకు వెళ్లాల్సి వస్తుందని అనగాని పేర్కొన్నారు. ఎవరైనా రెండు సంవత్సరాలు బయటకు వెళితే వారి ల్యాండ్‌లను లాక్కుంటున్నారని.. దీనిని ఒంగోలులో చూశామన్నారు. టైటిలింగ్ రిజిష్టర్ ఆఫీసర్ వద్దకు వెళ్లి సమస్యను పరిష్కారించుకోవాల్సి ఉంటుందన్నారు. వారసత్వ హక్కులను ఆయనే నిర్ణయిస్తారన్నారు. లేదంటే ఎవ్వరయినా నేరుగా హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఇది చిన్న, సన్నకారు రైతులకు అసలు సాధ్యం కాదన్నారు. ఈ చట్టాన్ని అమలులోకి తెస్తూ 512 జీవోను రహస్యంగా ఉంచారన్నారు. 20-10-2023లో ఈ చట్టం అమలులోకి వచ్చిందన్నారు. రెండు లెవల్స్ జుడీషియరీని పక్కన పెట్టేసేలా పేద రైతులకు అన్యాయం చేయాలని చూశారన్నారు. పేదవాడి భూమిని భక్షించేలా ఏపీ టైటలింగ్ యాక్ట్ ను రూపొందించారని అనగాని పేర్కొన్నారు. అందుకే ఈ చట్టాన్ని రద్దు చేయడానికి సభ ఆమోదించాలని కోరుతున్నానన్నారు.