ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అది నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా..వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 06:51 PM

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రమాదం ఘటన వెనుక ఉన్న నిజానిజాలను ప్రభుత్వం బయటపెట్టాలని వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. అనవసర ఆరోపణలు తగదన్న మిథున్ రెడ్డి.. సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేస్తే పరువు నష్టం కేసు వేస్తానంటూ హెచ్చరించారు. తమ కుటుంబం ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించిన మిథున్ రెడ్డి.. నిజమని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తామని సవాల్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులతో పాటుగా రెవెన్యూ అధికారులు విచారణ జరుపుతున్నారు.


ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రమాదం కేసుపై రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రియాక్టయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై టీడీపీ శ్రేణులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ ఘటనపై పసలేని ఆరోపణలు చేస్తున్నారన్న మిథున్ రెడ్డి.. దీనితో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తమ కుటుంబం ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఈ కుట్ర చేస్తున్నారని మిథున్ రెడ్డి ఆరోపించారు. తమకు ఉన్న ఆస్తులు వివరాలు అన్నింటిని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నామన్న మిథున్ రెడ్డి.. అనవసరంగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.


మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో నిజానిజాలను ప్రభుత్వం బయటపెట్టాలన్న మిథున్ రెడ్డి.. కథనాలు ప్రచురించేముందు తమ వివరణ తీసుకోవాలని సూచించారు. అలా కాకుండా ఏకపక్షంగా కథనాలు ప్రచురిస్తే.. పరువు నష్టం దావా వేస్తామంటూ హెచ్చరించారు. అలాగే తమపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేయాలని.. లేకపోతే పరువు నష్టం దావా వేస్తామని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తామని సవాల్ చేశారు. మరోవైపు ఈ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. పోలీసులతో పాటుగా రెవెన్యూశాఖ అధికారులు కూడా దీనిపై విచారణ చేపడుతున్నారు.


ఈ కేసు మీద సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో రెవెన్యూశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి సిసోడియా గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లతో సమావేశమయ్యారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులన్నీ భద్రంగా ఉన్నాయా లేదా అనే సంగతిని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి ఆరా తీశారు.


అలాగే తిరుపతి జిల్లాలో గత మూడేళ్లలో జరిగిన ల్యాండ్ కన్వర్షన్ భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ల్యాండ్ కన్వర్షన్ జరిగిన విధానంపై సిసోడియా సమీక్ష జరిపారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే భూములకు సంబంధించిన ఫిర్యాదులపై సిసోడియా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa