పారిస్ వేదికగా ఒలింపిక్ గేమ్స్ 2024 ప్రారంభం అయ్యాయి. ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు.ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలను స్టేడియంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి సంప్రదాయానికి భిన్నంగా పారిస్ మీదుగా ప్రవహించే సీన్ నది తీరంలో ఈ వేడుకలు చేపట్టనున్నారు.భారత్ నుంచి 117మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. 16 విభాగాల్లో సత్తా చాటేందుకు భారత క్రీడాకారులు ఉవ్విళ్లూరుతున్నారు.అత్యధిక పతకాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మన దేశం నుంచి అథ్లెటిక్స్ విభాగంలో అత్యధికంగా 29 మంది పోటీపడనున్నారు. ఆ తర్వాత అత్యధికంగా 21 మంది షూటర్లు ఉన్నారు. ఈ ఏడాది 72 మంది భారత ఒలింపియన్లు తొలిసారిగా ఒలింపిక్స్‌లో పోటీ పడనున్నారు. అంటే మొత్తం సంఖ్యలో 62 శాతం మంది కొత్తవారే. అలాగే ఈ సారి పాల్గొననున్న 117మంది క్రీడాకారుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు 8 మంది ఉన్నారు. ఈ ఏడాది ఒలింపిక్స్‌లో దేశం తరఫున ఐదుగురు ఒలింపిక్ పతక విజేతలు కనిపించనున్నారు. వారు నీరజ్ చోప్రా, పివి సింధు, లవ్లీనా బరాగోహై, మీరాబాయి చాను, భారత హాకీ జట్టు. గత ఒలింపిక్స్‌లో పాల్గొన్నవారి కంటే ఈసారి క్రీడాకారుల సంఖ్య తగ్గినా సాధించే పతకాల సంఖ్య మాత్రం పెరుగుతుందని శిక్షకులు అంచనా వేస్తున్నారు.