మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు, మొన్నటి ఎన్నికల్లో చంద్రగిరి వైసీపీ అభ్యర్థి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అరెస్టయ్యారు. తండ్రి భాస్కరరెడ్డి, తమ్ముడు హర్షిత్‌తో కలసి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా శనివారం రాత్రి బెంగళూరు దేవనహళ్లి ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో మోహిత్‌రెడ్డి నిందితుడిగా ఉన్న నేపథ్యంలో మోహిత్‌పై ఆంధ్ర సిట్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బోర్డింగ్ పాస్ చెక్ చేసే సమయంలో ఇమిగ్రేషన్ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. ఆయనతో పాటు దుబాయ్ వెళ్లాల్సిన భాస్కర రెడ్డి, హర్షిత్‌రెడ్డి కూడా ప్రయాణం విరమించుకుని మోహిత్ వెంటే ఉన్నారు. అధికారులతో భాస్కరరెడ్డి వాదనకు దిగడంతో తండ్రీకొడుకులు ముగ్గురినీ విమానాశ్రయంలోనే నిర్బంధించారు. మోహిత్‌రెడ్డిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచిన అనంతరం ఏపీ పోలీసులకు అప్పగించనున్నారు. తిరుపతి నుంచి ఈస్ట్ డీఎస్పీ రవిమనోహరాచారి, ఎస్వీయూ పోలీసు స్టేషన్ సీఐ మురళీమోహన్.. స్పెషల్ టాస్క్‌ఫోర్స్, ఏఆర్ పోలీసు బలగాలతో బెంగళూరు వెళ్లారు. మోహిత్‌ను అదుపులోకి తీసుకుని వీరు ఆదివారం వేకువజామున తిరుపతి చేరుకునే అవకాశముంది. ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో న్యాయమూర్తి ఇంటివద్ద హాజరుపరుస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో పోలీసు బలగాలు పెద్దఎత్తున మోహరించాయి. చెవిరెడ్డి నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.