కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. అల్లరిమూకల దాడిలో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రాంతానికి చెందిన గాలి దేవుడు తన గ్రామానికి చెందిన మరికొందరితో కలిసి తుని సమీపంలోని తలుపులమ్మ లోవకు బయలుదేరారు. టాటా మేజిక్ వాహనంలో వెళ్తుండగా కాకినాడ జగన్నాధపురం సెంటర్‌లో కొందరు అల్లరిమూకలు వాహనం ఆపి తగాదాకు దిగారు. గాలి దేవుడితో పాటు మరో ముగ్గురిపై అల్లరి మూకలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గాలి దేవుడిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో చనిపోయారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా ఈ హత్య చేశారా.. లేదంటే ఆకస్మాత్తుగా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్ళితే.... కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సూరయ్య చెరువు గ్రామానికి చెందిన గాలి దేవుడు (46) మరో పది మంది కలిసి టాటా మేజిక్ వాహనంలో శనివారం రాత్రి తమ స్వగ్రామం నుంచి తుని సమీపంలోని తలుపులమ్మ లోవకు బయలుదేరారు. ఆదివారం కావడంతో అమ్మవారికి మెక్కులు చెల్లించుకునే భక్తులు ఎక్కువమంది తెల్లవారుజామున లోవ చేరుకుని..అక్కడే వంట చేసుకుని అమ్మవారికి నైవేద్యం చెల్లించి.. సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకుంటారు. మొక్కు తీర్చుకునేందుకు గాలి దేవుడు తన బంధువులు, స్నేహితులతో కలిసి ఓ వాహనంలో బయలుదేరారు. అర్థరాత్రి 12 గంటల సమయంలో కాకినాడ జగన్నాధపురం సెంటర్‌కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న ఓ ముగ్గురు వ్యక్తులు గాలి దేవుడు వెళ్తున్న వాహనాన్ని ఆపి.. తమకు డాష్ ఇచ్చిందే మీరే అంటూ గొడవ పడ్డారు. మేము కాదని వారించే ప్రయత్నం చేసిన అవతలి వ్యక్తులు వినలేదు. చివరికి వివాదం పెద్దదికావడంతో గాలి దేవుడితో పాటు వాహనంలోని మరో ముగ్గురిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన గాలి దేవుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు.