ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్ళితే..... రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వాగతించారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన పవన్.. ‘రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయ. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కి అభినందనలు. గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరునే పెట్టుకున్నారు. ఆ దుస్సంప్రదాయానికి మంగళం పాడి.. విద్యార్థుల్లో స్ఫూర్తిని కలిగించే ప్రముఖుల పేర్లతో పథకాలు అమలు చేయడం మంచి పరిణామం. పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక ద్వారా యూనిఫాం, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్ లాంటివి ఇస్తున్నారు. ఈ పథకాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అమలు చేయడం సముచితం.’ అని పేర్కొన్నారు. ‘మధ్యాహ్న భోజన పథకానికి సైతం గత ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారు. ఇందుకు భిన్నంగా- ‘అపర అన్నపూర్ణ’ డొక్కా సీతమ్మ పేరును ఈ పథకానికి పెట్టడాన్ని ప్రతి ఒక్కరం స్వాగతించాలి. ఏ వేళలో అయినా కడుపు నిండా అన్నంపెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ. వారి దయాగుణం, సేవాభావం విద్యార్థులకు తెలియచేయడం ద్వారా ఆ సద్గుణాలు అలవడుతాయి.’ అని పవన్ ఎక్స్ వేదికగా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించారు.