సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని పొగడడానికే పరిమితమయ్యారని, ప్రధాని మోదీ పదేళ్ల కృషి వలన దేశం ప్రగతి సాధించింది అని చెబుతున్నారని.. ఏ విషయంలో దేశం అభివృద్ధి చెందిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య అలానే ఉందని, బ్లాక్ మనీ వెలికి తీస్తామన్నారు.. అదీ చేయలేకపోయారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, సీఎం చంద్రబాబు చెప్పేదానికి, జగన్ చెప్పేదానికి ఏమాత్రం పొంతన లేదని రామకృష్ణ అన్నారు. రాష్ట్ర అప్పులపై స్పష్టత లేని ప్రకటనలు చేస్తున్నారని, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఇచ్చిన దానిలో కూడా స్పష్టత లేదని, కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత ఇచ్చారు కానీ స్పష్టత లేని కేటాయింపులు చేశారని అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మీడియా సమావేశం పెట్టి వివరించాలని డిమాండ్ చేశారు. మదనపల్లెలో భూములు కబ్జా, పత్రాల దగ్ధం చేశారని, కడప జిల్లాలో కూడా లక్ష ఎకరాలపై చిలుకు భూములు కబ్జాకు గురయ్యాయని, దానిపై కూడా విచారణ జరిపించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలకు గురైన భూములపై విచారణ జరిపించాలన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ దగ్గర ఉన్న భూముల సమాచారం అందజేస్తామన్నారు. అన్ని ప్రాంతాల్లో అన్యాక్రాంతమైన భూములపై విచారణ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.