మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘సిగ్గు సిగ్గు... జగన్! ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతానని అనడం మీ అజ్ఞానానికి నిదర్శనం’ అంటూ షర్మిల విమర్శించారు. అసెంబ్లీకి రాకపోవడాన్ని మించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడా కనపడదని ఎద్దేవా చేశారు. ‘మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు జగన్. కానీ మిమ్మల్ని ఎన్నుకుని, అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది’ అని షర్మిల ఆక్షేపించారు. సోమవారం నాడు ట్విట్టర్(X) వేదికగా షర్మిల స్పందించారు.