అతడో నిత్యపెళ్లికొడుకు. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. ఇలా 4 రాష్ట్రాల్లోనే 20 మందిని మనువాడాడు. అయితే పెళ్లయి విడాకులు తీసుకున్న వారు.. భర్త చనిపోయిన వితంతువులనే ఆ వ్యక్తి టార్గెట్ చేసుకున్నాడు. ఆ తర్వాత వారి దగ్గరి నుంచి డబ్బులు, నగలు, ఇతర ఆభరణాలు తీసుకుని ఉడాయించేవాడు. చివరికి పాపం పండటంతో.. ఓ బాధితురాలు చేసిన ఫిర్యాదుతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది.
థానే జిల్లాలోని కళ్యాణ్‌కు చెందిన ఫిరోజ్ నియాజ్ షేక్ అనే 43 ఏళ్ల వ్యక్తి పెళ్లి పేరుతో మహిళలను మోసగిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. విచారణ చేపట్టి అతడ్ని అరెస్ట్ చేశారు. రెండో పెళ్లి కోసం మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో చూస్తున్న మహిళలనే తన టార్గెట్‌గా ఎంచుకునేవాడు. విడాకులు పొందిన మహిళలు, భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న మహిళలను.. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో చూసి.. వారిని కలిసేవాడు. అనంతరం వారికి మాయమాటలు చెప్పి నమ్మించి పెళ్లి చేసుకునేలా ఒప్పించేవాడు. ఆ తర్వాత తన పేరు, ఊరు మార్చి.. పెళ్లి చేసుకునేవాడు. శోభనం కూడా పూర్తి చేసుకుని.. వారికి పూర్తిగా నమ్మకం వచ్చిన తర్వాత వారి వద్ద ఉన్న నగదు, నగలు, ఇథర విలువైన వస్తువులు అన్నీ తీసుకుని అక్కడి నుంచి పారిపోయేవాడు.
ఇలా ఇంకో చోటుకు వెళ్లి.. ఇదే తంతు కొనసాగించేవాడు. ఇలా ఇప్పటివరకు 4 రాష్ట్రాల్లో 20 మంది మహిళలను మోసం చేసి.. వారి వద్ద బంగారం, డబ్బు, ఇతర ఖరీదైన వస్తువులు తీసుకుని.. ఇంకో చోటుకు మకాం మార్చేవాడని పోలీసులు విచారణలో వెల్లడైంది. ఇక ఫిరోజ్ నియాజ్ షేక్ చేతిలో మోసపోయిన నల్లా సోపారా ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. తనకు జరిగిన మోసాన్ని ఎంబీవీవీ పోలీసులకు చెప్పి ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి.. పట్టుకున్నారు. ఆ తర్వాత అతడిని విచారణ జరపగా.. అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నిందితుడిని థానే జిల్లాలోని కళ్యాణ్ ప్రాంతానికి చెందిన ఫిరోజ్ నియాజ్ షేక్‌గా గుర్తించారు. ఫిర్యాదు చేసిన మహిళను.. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా పరిచయం చేసుకుని ఆమెను నమ్మించి.. చివరికి పెళ్లి చేసుకున్నాడని ఎంబీవీవీ పోలీస్ స్టేషన్ సీఐ విజయ్‌సింగ్ భాగల్ వెల్లడించారు. ఈ ఘటనలో నిందితుడు ఫిరోజ్ నియాజ్ షేక్ దగ్గరి నుంచి రూ. 6 లక్షలకు పైగా డబ్బు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లు, చెక్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఫిరోజ్ నియాజ్ షేక్.. బాధితులు ఎవరు అని పోలీసులు ఆరా తీస్తున్నారు.