అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో టెక్ దిగ్గజం గూగుల్ జోక్యం చేసుకుంటోందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. ఇది ఇలాగే కొనసాగితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌నకు సంబంధించి ఎలాంటి సమాచారం వస్తుందో చూడండంటూ కొన్ని స్క్రీన్‌షాట్లను ఆయన షేర్ చేశారు. ట్రంప్‌పై ఏమైనా నిషేధం విధించారా? అని మస్క్ ప్రశ్నించారు. ట్రంప్ గురించి సెర్చ్ చేస్తే ‘ప్రెసిడెంట్ డొనాల్డ్ డక్’, ‘ప్రెసిడెంట్ డొనాల్డ్ రీగన్’ వంటివి వస్తున్నాయని తెలిపారు.
‘వావ్.. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై గూగుల్ నిషేధం విధించింది.. ఇది ఎన్నికల్లో జోక్యమేనా’ అని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘గూగుల్‌ను డెమొక్రాట్లు నడుపుతున్నారు’ అని ఒకరు.. ‘ఎలాన్, మీరు డెమొక్రాట్లను అణచివేస్తున్నారని వారు భావిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.. కానీ నా అల్గారిథమ్ రెండు పార్టీలు పోస్ట్ చేసిన ఆలోచనలు, అభిప్రాయాలను నాకు చూపిస్తుంది.. గతంలో ఒకే అభిప్రాయ పంచుకోనివారిపై నిషేధం ఉండేది’ అని ఇంకో నెటిజన్ కామెంట్ చేశారు. ‘మీకు నచ్చనివారి సెర్చ్ గురించి నిషేధం ఉంది. తేడా ఏమిటి?’ అని అన్నారు.
ఇక, అమెరికా అద్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య హోరాహోరీ పోరు నెలకుందని పలు మీడియా సర్వేలు వెల్లడిస్తున్నాయి. డెమొక్రాట్ల పార్టీకి ముందు నుంచి ఓటు బ్యాంకుగా ఉన్న నల్లజాతీయులతో పాటు మిగతా వర్గాలు కూడా కమలాకు మద్దతు తెలుపుతున్నట్టు పేర్కొన్నాయి. గతవారం వాల్‌స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన పోల్‌లో ట్రంప్, హ్యారిస్ మధ్య 2 శాతం వ్యత్యాసం ఉన్నట్టు వెల్లడయ్యింది. అటు, విరాళాల సేకరణలో కమలా హ్యారిస్ దూసుకెళ్తున్నారు. బైడెన్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న అనంతరం రేసులోకి వచ్చిన ఆమె.. వారంలోపే దాదాపు 20 కోట్ల డాలర్లను సేకరించడం విశేషం.
మరోవైపు, కమలా హ్యారిస్‌పై డొనాల్డ్ ట్రంప్ విమర్శలను తీవ్రతరం చేవారు. ఆమె బైడెన్ కంటే చెత్త అభ్యర్ధి అని దుయ్యబట్టారు. అంతేకాదు, బైడెన్‌ను సొంతపార్టీ వ్యక్తులే భయపెట్టి, ఆయన బలవంతంగా ఎన్నికల బరి నుంచి తప్పుకునేలా చేశారని ఆరోపించారు. అతివాద కమలా హ్యారిస్‌తో దేశంలో నేరాలు, ఘర్షణలు, మారణ హోమం, చావులు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. మిన్నెసోటాలో ప్రచారం నిర్వహించిన ట్రంప్.. తాము అధికారంలోకి రాగానే ఓపెన్ బోర్డర్ పాలసీని రద్దు చేస్తానని ప్రకటించారు.