అహంకారమే వైఎస్ జగన్ పతనానికి కారణమని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తేల్చిచెప్పారు. అసెంబ్లీకొచ్చి ప్రజాసమస్యలపై నిలదీయాలంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొమ్ము కాయడమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మూర్ఖత్వానికి ఆయన్ను మ్యూజియంలో పెట్టాలని ఎద్దేవాచేశారు. ఆయనకు చంద్రబాబు పిచ్చి పట్టుకుందన్నారు. గతంలో అద్ధంలో చూసుకోమని చెప్పానని, ఇప్పుడు కూడా అద్దంలో ఆయనకు చంద్రబాబే కనబడుతున్నాడని అన్నారు. మాజీ సీఎంను తాను విమర్శించినందుకు వైసీపీ సోషల్ మీడియాలో తనను కించపరుస్తూ ట్వీట్లు పెట్టడంపై ఆమె సోమవారం ‘ఎక్స్’లో ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో తనను కించపరిచేంత ద్వేషం జగన్‌కు ఉందని విమర్శించారు. కానీ ఆయనపై తమకు ద్వేషం లేదని షర్మిల స్పష్టం చేశారు. తప్పును తప్పు అనే చెప్పే ధైర్యం తమకుందన్నారు. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా అని జగన్‌ను నిలదీశారు. తప్పు చేస్తే ఏ పార్టీనైనా నిలదీసే అధికారం తమకుందని, అది అధికారపక్షమా.. ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదన్నారు. ‘అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు కాబట్టే తప్పన్నాం. చట్ట సభను గౌరవించకపోవడం తప్పు కాబట్టే రాజీనామా చేయమన్నాం’ అని తెలిపారు. వైఎ్‌సఆర్ విగ్రహాలు కూల్చేస్తే స్వయంగా నేనే అక్కడకు వచ్చి ధర్నా చేస్తానని అధికారపక్షానికి హెచ్చరికలు తానే చేశానని చెప్పారు. ‘అసలు మీరు అధికారంలో ఉండగా ఎన్టీఆర్ విగ్రహాలను కూల్చకుండా ఉండి ఉంటే.. ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే.. ఈ రోజున వైఎ్‌సఆర్‌కు ఇంతటి అవమానం జరిగి ఉండేది కాదు. అసలు వైఎ్‌సను, విజయమ్మను అవమానించినవారే వైసీపీలో పెద్దవాళ్లు’ అని విరుచుకుపడ్డారు. వైఎ్‌సఆర్‌సీపీలో వైఎ్‌సఆర్‌ను ఎప్పుడో వెళ్లగొట్టారని అన్నారు. ఇప్పుడు వైసీపీలో ఉన్నది.. వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి (సజ్జల) అని వ్యాఖ్యానించారు. వైఎ్‌సఆర్‌లా పోరాటాలు చేయడం జగన్‌కు చేతకాదని, ఆయనకు మీడియా పాయింటే ఎక్కువని ఎద్దేవా చేశారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసినందుకు గర్వపడుతున్నామని అన్నారు. వైసీపీ హయాంలో జగన్ రైతులను నిలువునా మోసం చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. రూ.3 వేల కోట్లతో ప్రతి ఏటా ధరల స్థిరీకరణ నిధి అన్నారని.. 4 వేల కోట్లతో పంటనష్ట పరిహారమన్నారని.. జలయజ్ఞానికి తూట్లు పొడిచారని.. జగన్ కంటే మోసగాళ్లు, విశ్వసనీయత కోల్పోయిన వారెవరైనా ఉంటారా అని మండిపడ్డారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం శరీరంలో అణువణువునా పిరికితనం పెట్టుకున్న జగన్ బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను.. వైఎస్ వ్యతిరేకించిన బీజేపీకి జగన్ తాకట్టు పెట్టారని షర్మిల విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa