ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెం దిన సంఘటన సోమవారం కాకినాడలో జరిగింది. కాకినాడ రూరల్ మండలం, డ్రైవర్స్ కాలనీకి చెందిన రెడ్డి చంద్రబోస్ (37) అవివాహితుడు. అతనికి తండ్రి జోగారావు, తల్లి వరలక్ష్మి, సోదరి ఉన్నారు. జోగారావు లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కొడుకును ఛార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) చదివిస్తున్నాడు. కుమార్తెకు వివాహమైంది. చంద్రబోస్ ఓపక్క సీఏ చదువుతూ మరోపక్క వలసపాకలలో ప్రైవేటుగా అకౌంటెంట్‌గా పనిచేస్తూ తండ్రికి సహాయకారిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో చంద్రబోస్ సోమవారం సాయంత్రం డ్యూటీ ముగించుకుని యాక్టీవా ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరుగు పయనమయ్యాడు. చంద్రబోస్ భానుగుడి మీదుగా టూటౌన్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నుంచి కిందికి దిగుతుండగా వెనుక నుంచి వేగంగా వస్తున్న ఏలేశ్వరం డిపోకి చెందిన పల్లెవెలుగు బస్సు బలంగా ఢీ కొట్టింది. దాంతో చంద్రబోస్ ఎగిరిపడి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే తనువు చాలించాడు. అనంతరం టూటౌన్ ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వర్‌నాయక్ సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనం తరం మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను వెంటనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.