ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే నెల 1న మడకశిర నియోజకవర్గంలోని గుండుమల గ్రామంలో పర్యటిస్తున్నారని, పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని డీఐజీ షీమూషి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం గుండుమల గ్రామంలో చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. హెలీప్యాడ్ స్థలాన్ని ప్రజా వేదిక స్థలాన్ని పింఛన్లు పంపిణీ చేసే ఇళ్ల వద్ద పరిశీలించారు. సీఎం పర్యటనకు రెండు రోజులే ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లను వేగవంతం చేయాలని, బందోబస్తుకు సంబంధించిన విషయాలను చర్చించారు. జిల్లా కలెక్టర్ టీఎ్‌స చేతన, జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్, సబ్‌కలెక్టర్ అపూర్వభరత, కదిరి ఆర్డీఓ వంశీకృష్ణ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామితోపాటు డీఎస్పీ బాజీజానసైదా, సీఐ, ఎస్‌ఐలతో కలిసి ఏర్పాట్లపై చర్చ జరిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో చిన్న పొరపాట్లకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పలు సూచనలు చేశారు. పింఛన్ల పంపిణీ సమయంలో ఇళ్ల వద్దకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెళ్లనున్న నేపథ్యంలో ఎలాంటి బందోబస్తు చేపట్టాలనే విషయంలో పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు జయప్ప, మాజీ సర్పంచ చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.