విజయవాడతో పాటుగా ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునేవారికి ఏపీ పర్యాటకశాఖ శుభవార్త చెప్పింది. తక్కువ ధరలో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునేందుకు విజయవాడ నుంచి తిరుపతికి ప్రతిరోజూ స్పెషల్ ప్యాకేజీ తీసుకొచ్చారు. తిరుమల ట్రిప్ ప్లాన్ చేసుకునేవారికి ఇది మంచి అవకాశమని పర్యాటకశాఖ అధికారులు తెలిపారు. ప్రతి రోజూ విజయవాడ నుంచి ఏసీ స్లీపర్ బస్సులో ప్రయాణం.. వసతి, భోజనాలు, దర్శనాలను పర్యాటకశాఖ సమకూరుస్తుంది.. ఈ టూర్ ప్యాకేజీ రెండు రోజులు ఉంటుంది.
వాస్తవానికి విశాఖపట్నం నుంచి బయలుదేరే ఈ ఏసీ స్లీపర్ బస్సులకు విజయవాడలో కూడా స్టాప్ పాయింట్ ఇవ్వటంతో ప్రత్యేక ప్యాకేజీ అమల్లోకి తీసుకొచ్చారు. ప్రతిరోజూ రాత్రి 11 గంటలకు విజయవాడ బెంజిసర్కిల్ నుంచి ఈ యాత్ర బస్సు బయల్దేరుతుంది. బెంజిసర్కిల్ దగ్గర ఉన్న ఫ్లై ఓవర్ పిల్లర్ నెంబర్ 4 దగ్గర ఏపీటీడీసీకి చెందిన ఏసీ స్లీపర్ బస్సు హాల్ట్ ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారు ఇక్కడికి రావాల్సి ఉంటుందని సూచించారు. ఈ బస్సు తెల్లవారుజామున 6 గంటలకు తిరుమల చేరుతుంది.. కొండపై వారికి వసతి కల్పిస్తారు.
ఉదయం టిఫిన్, 10 గంటలకు తిరుమల శ్రీవారి దర్శనం చేయిస్తారు. అనంతరం భోజనం తర్వాత.. తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం ఉంటుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు డిన్నర్ ఉంటుంది.. తిరిగి అర్ధరాత్రి తిరుపతి నుంచి బస్సు బయలుదేరి మరుసటి రోజు ఉదయం విజయవాడ వస్తుంది. ఈ స్పెషల్ ప్యాకేజీ ధరల వివరాలు ఇలా ఉన్నాయి.. పెద్దలకు రూ. 3,970, పిల్లలకు రూ.3,670గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుందని.. విజయవాడ నుంచి తిరుపతికి ఆసక్తి కలవారు 9848007025, 9440251775, 0866-2571393 నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని ఏపీటీడీసీ తెలిపింది. విజయవాడ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నవారికి ఈ ప్యాకేజీ అద్భుతమైన అవకాశం అంటున్నారు పర్యాటకశాఖ అధికారులు.