కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తమామలపై అల్లుడు కత్తితో దాడి చేయగా అత్త మృతిచెందగా, మామ తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అడ్డూరుకు చెందిన మామిడి పైడినాయుడు(32)కు అదే గ్రామానికి చెందిన సానబోయిన పైడిరాజు, లక్ష్మి కుమార్తె పూర్ణ సంధ్యతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో పిల్లలతో సహా పూర్ణ సంధ్య పుట్టింట్లో ఉంటోంది. పైడినాయుడు తన భార్య, అత్తమామలతో తరచూ గొడవ పడుతుండడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం పైడినాయుడు అత్తవారింటికి వెళ్లి గొడవపడ్డాడు అత్త సానబోయిన లక్ష్మిని కత్తితో దారుణంగా పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అడ్డొచ్చిన మామ పైడిరాజుపైనా కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అతడి కేకలకు చుట్టుపక్కలవారు అక్కడకు చేరడంతో ఏమీ తెలియనట్టు పైడినాయుడు తన అత్త మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి, తీవ్ర గాయాలపాలైన తన మామను తానే విశాఖ కేజీహెచ్‌కు తీసుకువెళ్లాడు. కత్తిపీటపై పడడంతో తీవ్ర గాయాలపాలైనట్టు వైద్యాధికారులకు తెలిపాడు. వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సోమవారం రాత్రి అడ్డూరు చేరుకుని పైడిరాజు ఇంటి తలుపులు బలవంతంగా తెరిపించడంతో లోపల అత్త లక్ష్మి మృతదేహం కనిపించింది. మృతురాలి కుమార్తె పూర్ణ సంధ్య ఫిర్యాదు మేరకు సీఐ బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సంధ్య మైనర్‌గా ఉన్నప్పుడే పైడినాయుడు ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడని, ఆ తరువాత పెళ్లికి ముఖం చాటేయడంతో ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు మూడేళ్ల క్రితం పోక్సో కేసు నమోదు చేశారని, పెద్దల జోక్యంతో సంధ్యను పెళ్లాడాడని చెబుతున్నారు. తన భార్య, అత్తమామలను హత్య చేస్తానంటూ పైడినాయుడు గ్రామంలో పలువురికి చెప్పినట్టు స్థానికులు తెలిపారు.