అనంతపురం నగరంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం ప్రజా దర్బారు నిర్వహించారు. వివిధ వర్గాల ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. సమస్యలను తెలిపేందుకు వచ్చిన నాయకులు, ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. అక్కడికక్కడే పరిష్కరించలేని సమస్యలను సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశారు. సుమారు రెండు గంటల పాటు ప్రజా దర్బారు నిర్వహించిన ఆయన.. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో సుపరిపాలన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. ప్రజాదర్బార్‌కు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించే విషయంలో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించామని అన్నారు. ఎలాంటి సమస్యకైనా సత్వర పరిష్కారం చూపాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఆ గురుతర బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందనే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నామని అన్నారు.