పోటీ చేసిన 21 స్థానాలకు గాను 21 స్థానాల్లోనూ గెలుపొంది దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన జనసేన పార్టీ.. రాజకీయ వర్గాలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ మరో కీలక నిర్ణయం ప్రకటించింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రకటించి, షెడ్యూల్ విడుదల చేశారు ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్. ఆగస్టు 1వ తేదీ నుంచి జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండి ప్రజల నుంచి అర్జీలు, పార్టీ శ్రేణుల నుంచి అభ్యర్థనలు స్వీకరించనున్నారు. జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి నెలా కనీసం రెండు రోజుల పాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ఇంతకుముందే ఆదేశాలు ఇచ్చారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు, వారు ఎదుర్కొనే ఇబ్బందులు విని, పరిష్కారాలు సూచించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు అందుబాటులో ఉండి, వారి నుంచి విజ్ఞాపనా పత్రాలు, పార్టీ శ్రేణుల నుంచి వచ్చే అభ్యర్థనలు, సూచనలను స్వయంగా స్వీకరించనున్నారు.
ఆగస్టు 1, 2 తేదీల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ.. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు. 3, 4 తేదీల్లో నెల్లమల్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి తన నియోజకవర్గ ప్రజల సమస్యలు వింటారు. ఇలా.. సెప్టెంబర్ 10, 11 తేదీల వరకు (మచిలీపట్నం - ఎంపీ బాలశౌరి) పార్టీ ప్రజా ప్రతినిధుల షెడ్యూల్‌ను జనసేన కార్యాలయం బుధవారం (జూలై 31) సాయంత్రం విడుదల చేసింది.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ‘ఆంధ్రాలో ఏం జరుగుతోంది? సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీల షెడ్యూల్‌ను రూపొందించిన పార్టీని ఇంతవరకూ చూడలేదు. ఈ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ తమను అధికారంలోకి తెచ్చిన ప్రజల ఆకాంక్షలను నిలబెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీ వ్యవస్థ పనితీరును మారుస్తున్నారు’ అంటూ ఓ యూజర్ రాసుకొచ్చారు.
గణనీయంగా పెరిగిన జనసేన సభ్యత్వాలు
పది లక్షల సభ్యత్వ నమోదు క్రాస్ చేసి మరో రికార్డును సొంతం చేసుకుంది జనసేన పార్టీ. పార్టీని మరింత బలోపేతం చేయడంపై పవన్ కళ్యాణ్ దృష్టిపెట్టారు. అందులో భాగంగా జూలై 18 నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభించారు. వారం రోజుల వ్యవధిలోనే 10 లక్షల సభ్యత్వాలు నమోదు కావడం విశేషం. దీంతో ఈ సభ్యత్వ నమోదు గడువును పెంచారు. మరో వారం రోజులపాటు సభ్యత్వ నమోదు చేసుకోవచ్చని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ సభ్యత్వ నమోదు సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 175 నియోజకవర్గాలతో పాటు తెలంగాణలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయి.