ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా చేసిన ఓ ట్వీట్.. అధికార విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ అంశం పార్లమెంటులో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణం అయింది. లోక్‌సభలో కులగణనకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పటికే తీవ్ర దుమారానికి కారణం కాగా.. తాజాగా అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని ట్వీట్ చేసిన ప్రధాని మోదీ.. ప్రతీ ఒక్కరు తప్పకుండా వినాల్సిన ప్రసంగం అంటూ క్యాప్షన్ జోడించడంపై కాంగ్రెస్ సహా మిగిలిన ఇండియా కూటమి నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై సభాహక్కుల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని హామీర్పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. అయితే అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను బుధవారం ట్వీట్ చేసిన ప్రధాని.. అది ప్రతీ ఒక్కరు తప్పక వినాలని పిలుపునిచ్చారు. ఇది ఇండియా కూటమి రాజకీయ కుట్రలను బహిర్గతం చేస్తోందని మోదీ ట్వీట్ చేశారు. అయితే దీనిపై కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలన్నీ తీవ్రంగా మండిపడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, జలంధర్ ఎంపీ చరణ్ జీత్ సింగ్ ఛన్నీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై.. సభాహక్కుల ఉల్లంఘన కింద లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. ఇక అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని షేర్ చేసి.. ప్రధాని మోదీ పార్లమెంటరీ హక్కులకు అత్యంత తీవ్రమైన ఉల్లంఘనకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆ ప్రసంగంలో అత్యంత దుర్వినియోగం, రాజ్యాంగ విరుద్ధమైన దుష్ప్రచారంగా ఉందని మండిపడ్డారు. మరోవైపు.. అనురాగ్ ఠాకూర్ ప్రసంగంలోని కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తొలగిస్తామని సభాపతి చెప్పినా.. సంసద్ టీవీ మాత్రం మొత్తం వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిందని.. అదే వీడియోను మోదీ షేర్ చేశారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఇది ముమ్మాటికీ సభా హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.
రాహుల్ గాంధీపై అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలతో ఇండియా కూటమి నేతలు మంగళవారం సభలో గందరగోళం సృష్టించారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించాలని.. ఆయన రాహుల్ గాంధీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వెల్ లోకి దూసుకొచ్చి నిరసన వ్యక్తం చేయడంతో సభను వాయిదా వేశారు. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన రాహుల్ గాంధీ.. తనకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పార్లమెంటులో కులగణన చేసి తీరుతామని స్పష్టం చేశారు.
కులగణనపై రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకు స్పందించిన అనురాగ్ ఠాకూర్.. అసలు కులమే లేని వారు కులగణన గురించి మాట్లాడుతున్నారని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. మరో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ.. పగలు, రాత్రి.. కులం, కులం అంటూ దేశంలో విభజన తీసుకువస్తున్నారని సంచలన ఆరోపణలు గుప్పించారు.