కేరళలో వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి 4 గ్రామాలు నేలమట్టం అయిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం తీవ్ర సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే సహాయక చర్యలు కొనసాగిస్తున్న రెస్క్యూ సిబ్బంది.. మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఘోర దుర్ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 170 దాటినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు.. కేరళలో ప్రకృతి బీభత్సానికి సంబంధించిన అంశం పార్లమెంటును కుదిపేస్తోంది. ఈ క్రమంలోనే వయనాడ్ కొండ చరియల విరిగిపడిన ఘటనకు సంబంధించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పంతా కేరళలో అధికారంలో ఉన్న పినరయి విజయన్ ప్రభుత్వానిదేనని రాజ్యసభ సాక్షిగా ఎండగట్టారు.
కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని.. కొండచరియలు కూడా విరిగిపడే అవకాశాలు ఉన్నాయని ఆ రాష్ట్రాన్ని ముందే హెచ్చరించామని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ భీకర ముప్పు గురించి జులై 23 వ తేదీనే కేరళ ప్రభుత్వాన్ని కేంద్రం అప్రమత్తం చేసిందని తెలిపారు. అయినప్పటికీ కేరళ ప్రభుత్వం మాత్రం ప్రజలను సకాలంలో.. అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో విఫలం అయిందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారీ వర్షాలు కురవగానే 9 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను కేరళ రాష్ట్రానికి పంపించినట్లు తెలిపారు. కేరళలో భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో తాజా పరిణామాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు.
దేశంలో ప్రకృతి వైపరీత్యాల గురించి 7 రోజుల ముందే హెచ్చరికలు చేసే వ్యవస్థ భారత్ కలిగి ఉందని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రపంచంలో ఇలాంటి టెక్నాలజీ ఉన్న 4 దేశాల్లో భారత్ ఒకటి అని తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకున్న వెంటనే అప్రమత్తమై ఉంటే ప్రాణ నష్టం కూడా తగ్గి ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వయనాడ్ విషాదాన్ని ఎదుర్కొనేందుకు కేరళ ప్రభుత్వంతోపాటు అక్కడి ప్రజలకు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా అమిత్ షా తేల్చి చెప్పారు.
మరోవైపు.. వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతుండటం తీవ్ర కలవరం రేపుతోంది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 170 దాటినట్లు కేరళ వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాదాపు మరో వంద మంది ఆచూకీ గల్లంతైనట్లు వెల్లడించింది. ఈ ప్రమాదంలో గాయపడిన సుమారు 200 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వయనాడ్ జిల్లాలో సోమ, మంగళవారాల్లో కురిసిన భారీ వర్షాలు మెప్పడి, మండక్కై, చూరాల్మల, అట్టామల, నూల్‌పుజా గ్రామాల్లో బీభత్సం సృష్టించాయి. కొండ చరియలు విరిగిపడి 4 గ్రామాల ఆనవాళ్లు పూర్తిగా లేకుండా పోయాయి. ఈ ఘటనలో వందల ఇళ్లు నేలమట్టం అయ్యాయి.