కేరళలో ప్రకృతి విలయతాండవం చేసింది. వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో గంటగంటకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 276 మృతదేహాలను బయటపడ్డాయి. మరో 240 మందికి పైగా గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇంకా తెలియరావట్లేదు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లోనూ దాదాపుగా ఇవే తరహా పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల వల్ల అక్కడి నదులు ఉప్పొంగాయి. ప్రత్యేకించి- బియాస్ నది ఉగ్రరూపాన్ని దాల్చింది. తీర ప్రాంతాలను ముంచెత్తుతోంది. పార్వతి నది ఎప్పుడూ లేని విధంగా వరదపోటుకు గురైంది. ఈ వరదల్లో ఇప్పటివరకు ముగ్గురు మరణించారు. 40 మందికి పైగా గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. జాతీయ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రస్థాయి వైపరీత్యాల నిర్వహణ బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటోన్నాయి. కొన్ని చోట్ల హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. మనాలి జాతీయ రహదారి పలుచోట్ల కొట్టుకుపోయింది. ఝాక్రీ, సమేజ్‌ఖుద్, మండీ జిల్లాలోని రాజ్‌బాన్, మణికర్ణ్, సాత్ సబ్జీ గ్రామాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఆయా జిల్లాల్లో మొత్తం 40 మంది గల్లంతయ్యారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. సిమ్లా అదనపు జిల్లా కలెక్టర్ డాక్టర్ మదన్ కుమార్, మండీ డిప్యూటీ కమిషనర్ అపూర్వ్ దేవగణ్ సంఘటనా స్థలాలను పరిశీలించారు. రెస్క్యూ కార్యకలాపాలను పర్యవేక్షించారు.