గోదావరి పరీవాహక ప్రాంతంలోని గిరిజన ఆవాసాలను ముంచెత్తిన వరదలు గరిష్ఠ స్థాయిలో పోలవరం ప్రాజెక్టు కింద చోటుచేసుకునే స్థాయి ముంపును సృష్టించాయి. 2020 నుం చి ఈ పరిస్థితులు ఎదురవుతున్నా వరద ముంపును నిరోధించే శాశ్వత చర్యలు కొరవడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఐదు మం డలాల్లో పోలవరం ప్రాజెక్టు కింద 236 ఆవాసాలు ముంపునకు గురవుతుండగా 67,503 కుటుంబాల వారు నిర్వాసితులుగా ఉన్నారు. మొదటి దశలో 101 ఆవాసాలు ముంపునకు గురవుతున్నాయి. వీటిలో దేవీపట్నం మండలంలోని 46 ఆవాసాలు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. ఇక నాలుగు విలీన మండలాల్లోని 190 ఆవాసాల్లో పునరావాసం అమలుకావాల్సి ఉంది. కాగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండానే వరదలు ఈ ఆవాసాలకు పోలవరం ప్రాజెక్టు ముంపు కష్టాల్ని రుచి చూపిస్తున్నాయి. 2020 నుంచి తాజా వరదల వరకు నాలుగు విలీన మండలాల్లో 134 ఆవాసాలు తరచూ ముం పును ఎదుర్కొంటున్నాయి. 1986నాటి తీవ్ర వరదలను లెక్కచేయని విలీన మండలాల గ్రామాలను పోలవరం కాఫర్‌డ్యామ్‌తో ముంపు తీవ్రత పెరిగి వరదలు కలవరపెడుతున్నాయి. గతంలో పోలవరం వద్ద 14 మీటర్ల స్థాయిలోనే గోదావరి ధవళేశ్వరం ఆనకట్టవైపు సులభంగా వెళ్లిపోయేది. ఇప్పుడు 40 మీటర్లు మించితేగానీ వెళ్లని పరిస్థితి కాఫర్ డ్యామ్, పోలవరం స్పిల్‌వే కారణంగా నెలకొంది. ఏ స్థాయిలో ఎన్ని క్యూసెక్కుల నీరు కిందకు వెళ్తుందో ఇంజనీర్లు ఇప్పటికే పేర్కొన్నారు. ఇటీవల పోలవరం కాఫ ర్ డ్యామ్ వద్ద నీటిమట్టం సుమారు 35 మీటర్ల వరకూ వెళ్లింది. ఈ స్థా యికి మించి 41.15 మీటర్ల స్థాయిలో మొదటి దశగా పోలవరం ప్రాజెక్టు కింద నీటిని నిల్వచేసినా విలీన మండలాల్లో 60 ఆవాసాలు మాత్రమే ప్రభావానికి లోను కావాల్సి ఉండగా వరదలు 134 ఆవాసాలను ముంచుతున్నాయి. ఇది ఏకంగా పోలవరం ముంపు లెక్కలనే తప్పుబట్టేలా ఉంది. 2019, 2020 వరదల్లో అసంపూర్ణంగా ఉన్న కాఫర్ డ్యామ్ కారణంగానే వరద తీవ్రత పోలవరం గరిష్ఠ స్థాయి... అంటే 45.72 మీటర్లలో మునిగే గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయని చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి 2021లో ప్రభుత్వానికి ఇచ్చిన ఒక నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. తర చుగా వచ్చే వరదల నుంచి విలీన మండలాల్లోని గ్రామాలను కాపాడాలం టే నిర్వాసితులకు పునరావాస కాలనీలను తక్షణం నిర్మించాలని పరోక్షంగా సూచించారు. ఈ ముంపు గ్రామాల కోసం 110 కాలనీలను పూర్తి చేయాల్సి ఉంది. అయితే గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం విలీన మండలాల కోసం ఒక్క కాలనీని పూర్తి చేయలేదు. కూటమి ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుని న్యాయం చేస్తుందని విలీన మండలాల ప్రజలు ఆశిస్తున్నారు.