కేంద్రప్రభుత్వ ఎరువుల నియంత్రణ చట్టాన్ని సమర్ధవంతంగా అమలుచేయడం ద్వారా నకిలీ ఎరువులు, పురుగుమందులను నియంత్రించ వచ్చని భారత ప్రభుత్వ రాష్ట్రీయ ఎరువుల నియంత్రణ ప్రయోగశాల ఉపసంచాలకులు అరుణ్ అన్నారు. రాజమహేంద్రవరంలో 3రోజలపాటు 13 జిల్లాల మండల వ్యవసాయ అధికారులు, సహాయ వ్యవసాయ సంచాలకులకు నిర్వహించే శిక్షణా కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అరుణ్ మాట్లాడుతూ మండలంలో ఎరువులు, పురుగుమందుల దుకాణాలను నిత్యం పర్యవేక్షించి రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు అందేలా వ్యవసాయ అఽధికారులు కృషి చేయాలన్నారు ప్రతీ దుకాణంవద్ద నిల్వ బోర్డులు ప్రద ర్శించాలని సంబంధిత రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలన్నారు. వ్యవసాయశాఖ అదనపు సంచాలకులు కృష్ణదాసు మాట్లాడుతూ మండల వ్యవసాయ అధికారులు, ఆయా మండలాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త శిక్షణకు జిల్లాకు అవకాశం కల్పించ డం ఆనందం అన్నారు. ఈ కార్యక్రమంలో కైకలురు వ్యవసాయ సహాయ సంచాలకులు గంగాధర్, ఎరువుల నియంత్రణ చట్టంపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ శిక్షణార్థులకు అవగాహన కల్పించారు. రాజమహేంద్రవరం, కోరుకొండ ఏడీఏలు శ్రీనివాసరెడ్డి, మల్లిఖార్జునరావు, ఏవోలు భీమరాజు, శ్రీనివాస్, సూర్యరమేష్,ఆలీవ్, వాణి పాల్గొన్నారు.